Ashes Series 2nd Test: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్‌... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే!

21 Dec, 2021 08:10 IST|Sakshi

ఎదురులేని ఆసీస్‌

డే–నైట్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై 275 పరుగుల తేడాతో ఘనవిజయం

జే రిచర్డ్‌సన్‌కు ఐదు వికెట్లు

Ashes Series Adelaide Test: డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు తమ అజేయ రికార్డును కొనసాగిస్తోంది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో డే అండ్‌ నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తొమ్మిది డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడగా అన్నింటా విజయం సాధించడం విశేషం. 468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 113.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 82/4తో ఆట చివరి రోజైన సోమవారం బ్యాటింగ్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ను ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ (5/42) బెంబేలెత్తించాడు. మిచెల్‌ స్టార్క్, నాథన్‌ లయన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్‌ వోక్స్‌ (44; 7 ఫోర్లు) ఇంగ్లండ్‌ టీమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం చేసిన ఆసీస్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందుకున్నాడు. బాక్సింగ్‌ డే టెస్టు మెల్‌బోర్న్‌ వేదికగా ఈ నెల 26న ఆరంభం కానుంది. 

బట్లర్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌ .. 50.4 ఓవర్లను ఎదుర్కొంది వారిద్దరే!
ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ (26; 2 ఫోర్లు) ‘డ్రా’ కోసం వీరోచితంగా పోరాడాడు. ఏకంగా అతడు 207 బంతులను ఎదుర్కొన్నాడు. వోక్స్‌ (97 బంతుల్లో 44; 7 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఒక దశలో వీరిద్దరు కలిసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించారు.

అయితే బౌలింగ్‌కు వచ్చిన రిచర్డ్‌సన్‌... వోక్స్, బట్లర్‌లను అవుట్‌ చేశాడు. వోక్స్‌ బౌల్డ్‌ కాగా... బట్లర్‌ను దురదృష్టం వెంటాడింది. రిచర్డ్‌సన్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడే క్రమంలో బట్లర్‌ కుడి కాలు వికెట్లకు తాకింది. దాంతో అతడు హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి రోజు ఇంగ్లండ్‌ 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయగా... అందులో 50.4 ఓవర్లను బట్లర్‌–వోక్స్‌ ద్వయమే ఎదుర్కొంది. 

చదవండి: SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్‌.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ

మరిన్ని వార్తలు