Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్‌, బట్లర్‌ పాపం..

20 Dec, 2021 16:50 IST|Sakshi
PC: ECB

Ashes 2nd Test: 77 బంతుల్లో 12 పరుగులు ... 207 బంతుల్లో 26 రన్స్‌... 97 బంతుల్లో 44 పరుగులు... యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌ స్కోర్లు ఇవి. ఓటమి ఖాయమని తెలిసినా.. ఆఖరి వరకు పట్టుదల వదలకుండా గట్టిగా క్రీజులో నిలబడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్‌ జై రిచర్డ్‌సన్‌ ముప్పుతిప్పలు పెడుతున్నా తట్టుకుంటూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

కానీ... అప్పటికే మ్యాచ్‌పై పట్టు బిగించిన కంగారూలు ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించారు. దీంతో పర్యాటక జట్టుకు నిరాశ తప్పలేదు. ఏకంగా 275 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య ఆసీస్‌కు 2-0 ఆధిక్యం దక్కింది. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌కు ఇది ఎనిమిదో పరాజయం. భారత్‌లో టీమిండియాతో మూడు, ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌తో ఒకటి, టీమిండియాతో రెండు.. ఇప్పుడు యాషెస్‌లో రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. మూడో టెస్టులో గనుక ఓడిపోతే బంగ్లాదేశ్‌ పేరిట ఉన్న చెత్త రికార్డును ఇంగ్లండ్‌ ఖాతాలో పడుతుంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు జో రూట్‌ బృందం ఆట తీరుపై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘డ్రెస్సింగ్‌ రూంలో చర్చ జరగాలి. ఈ జట్టు గురించి ఎవరేమనుకున్న ఫర్వాలేదు. నా వరకైతే అత్యంత  ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన టీమ్‌ ఇది. మార్పులు అవసరం లేదు. తదుపరి మ్యాచ్‌లో విజయం సాధిస్తారు’’అంటూ రిక్కీ క్లార్క్‌ ట్వీట్‌ చేశాడు. ఆసీస్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. 5-0 తేడాతో కంగూరు జట్టు క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమంటూ ఇప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.

చదవండి: Peng Shuai: తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి  

మరిన్ని వార్తలు