-

విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ

21 Feb, 2021 15:13 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ కనీస ధరకే అమ్ముడుపోవడంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పెదవి విరిచాడు. చెన్నై వేదికగా జరిగిన వేలంలో రూ.కోటితో ఉమేశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. భారత అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న ఉమేశ్ యాదవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ మినహాయిస్తే మిగతా ఫ్రాంఛైజీలు అసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యం కలిగించిందని నెహ్రా చెప్పుకొచ్చాడు.

‘తప్పుగా అనుకోమంటే ఒక మాట చెప్పాలని ఉంది. పేరు లేని బౌలర్లకు అంత వెచ్చించి .. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్‌ను అంత తక్కువ ధర ఇవ్వడం బాగాలేదు. వాస్తవానికి జై రిచర్డ్‌సన్, కైల్ జేమిసన్ ఇంకా నిరూపించుకునే దశలో ఉన్నారు. టెస్టుల పరంగా జేమిసన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. రిచర్డ్‌సన్ పెర్త్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఉమేశ్ యాదవ్‌తో పోలిస్తే.. జేమిసన్‌, రిచర్డ్‌సన్‌ అనుభవం ఎంత..? వేలంలో ఎక్కువ ధరకి ఎలా అమ్ముడుపోయారనేది అర్థం కావడం లేదు.

ఉమేశ్‌ వేలంలో తక్కువ ధరకు అమ్ముడయ్యాడన్న బాధ కన్నా పేరులేని బౌలర్లకు అంత పెట్టినందుకు ఆశ్చర్యం కలిగింది. మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ లాంటి బౌలర్లు భారీ ధరకి అమ్ముడుపోయారంటే అర్థం ఉంది.ఎందుకంటే ఇప్పటికే వారు తమ సత్తాను ప్రపంచానికి నిరూపించారు.' అని చెప్పుకొచ్చాడు. కాగా ఉమేశ్‌ను కనీస మద్దతు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ కూడా తప్పుబట్టాడు.

కాగా దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్‌ మోరిస్‌కు వేలంలో రూ.16.25 కోట్లకి అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ కోసం రూ.15 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేయగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌కు రూ.14 కోట్లు వెచ్చించి  పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది.
చదవండి: ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్
'అంత తక్కువ ధర.. ఐపీఎల్‌ ఆడకపోవచ్చు'

మరిన్ని వార్తలు