ఆరోజు సచిన్‌ నక్కతోకను తొక్కాడు : నెహ్రా

11 Aug, 2020 12:56 IST|Sakshi

ఢిల్లీ : 2011 ప్రపంచకప్‌ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అదృష్టం భలే కలిసొచ్చిందంటూ టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిశ్‌ నెహ్రా పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్‌ 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడినా.. నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఆనాటి మ్యాచ్‌ విషయాలను నెహ్రా మరోసారి పంచుకున్నాడు.

'నిజంగా ఆరోజు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ నక్కతోక తొక్కివచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే అతను చేసిన 85 పరుగులు.. నాలుగు సార్లు పాక్‌ ఫీల్డర్లు క్యాచ్‌లు విడవడం ద్వారా సాధించాడు. అదృష్టం అంటే ఎలా ఉంటుందో బహుశా సచిన్‌కు ఆరోజు తెలిసి ఉంటుంది. సచిన్‌కు నెర్వెస్‌ నైంటీస్‌ అనే ఫోబియా ఉండేది.. కానీ పాక్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆ ఫోబియా కనిపించలేదు.. కానీ ఒత్తిడి కనిపించింది. సచిన్‌ నాలుగుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే ఆరోజు అదృష్టం అతని వెంట ఉంది. ఇక ప్రపంచకప్‌లో ఒక కీలక మ్యాచ్‌లో ఒత్తిడి ఉండడం సహజం.. అది ఇండియా-పాక్‌, ఇండియా- ఇంగ్లండ్‌ ఏ మ్యాచ్‌ అయినా కావొచ్చు.. మేం సెమీఫైనల్‌ చేరుకొని ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించాం 'అంటూ ఆశిష్‌‌ నెహ్రా చెప్పుకొచ్చాడు.('ఆకలితో ఉన్నా.. రిటైరయ్యే ఆలోచన​ లేదు')

ఇక పాక్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 260 పరుగులు చేసింది. సచిన్‌ ఈ మ్యాచ్‌లో 85 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సచిన్‌ వరుసగా 25,45,70,81 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. మిస్బా, యూనిస్‌ ఖాన్‌, కమ్రాన్‌ అక్మల్‌, ఉమర్‌ అక్మల్‌లు నాలుగుసార్లు క్యాచ్‌లు జారవిడిచారు. ఆ తర్వాత భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్‌ జట్టు 231 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. దీంతో ఫైనల్లోకి ప్రవేశించిన భారత్‌ శ్రీలంకపై ఘనవిజయం సాధించి 28 సంవత్సరాల నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై రెండోసారి సగర్వంగా ప్రపంచకప్‌ను అందుకుంది.

మరిన్ని వార్తలు