యాష్లే బార్టీ, నాదల్‌ శుభారంభం

10 Feb, 2021 08:22 IST|Sakshi

మెల్‌బోర్న్‌: దాదాపు సంవత్సరం తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ మ్యాచ్‌ ఆడిన మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) తన ప్రత్యర్థిని హడలెత్తించింది. ఒక్క గేమ్‌ కూడా ఇవ్వకుండా ఫటాఫట్‌గా కేవలం 44 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో శుభారంభం చేసింది. 82వ ర్యాంకర్‌ డాంకా కొవోనిచ్‌ (మాంటెనిగ్రో)తో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో యాష్లే బార్టీ 6–0, 6–0తో విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించింది. నెట్‌ వద్దకు వచ్చిన ఆరుసార్లూ పాయింట్లు గెలిచింది. తొలి సెట్‌లో మూడుసార్లు, రెండో సెట్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్‌ పాయింట్లు సాధించింది.  

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఆరో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), 11వ సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌),  రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సోఫియా కెనిన్‌ 7–5, 6–4తో మాడిసన్‌ ఇంగ్లిస్‌ (ఆస్ట్రేలియా)పై, స్వితోలినా 6–3, 7–6 (7/5)తో బుజ్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, కరోలినా ప్లిస్కోవా 6–0, 6–2తో జాస్మిన్‌ పావోలిని (ఇటలీ)పై, బెన్సిచ్‌ 6–3, 4–6, 6–1తో లారెన్‌ డేవిస్‌ (అమెరికా)పై నెగ్గారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012, 2013 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 12వ సీడ్‌ అజరెంకా 5–7, 4–6తో జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓటమి చవిచూసింది.

నాదల్‌ బోణీ
పురుషుల సింగిల్స్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ తొలి రౌండ్‌ను అలవోకగా దాటాడు. లాస్లో జెరె (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 6–3, 6–4, 6–1తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ ఐదు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 6–2, 6–2, 6–4తో పోస్పిసిల్‌ (కెనడా)పై, ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 6–1, 6–2, 6–1తో గైల్స్‌ సిమోన్‌ (ఫ్రాన్స్‌)పై, ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–3, 6–3, 6–4తో హాన్ఫ్‌మన్‌ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్‌ బెరెటిని (ఇటలీ) 7–6 (11/9), 7–5, 6–3తో అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందారు. 12వ సీడ్‌ అగుట్‌ (స్పెయిన్‌) 7–6 (7/1), 0–6, 4–6, 6–7 (5/7)తో రాడూ అల్బోట్‌ (మాల్డొవా) చేతిలో... 13వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 6–3, 4–6, 7–6 (7/4), 6–7 (6/8), 3–6తో ‘వైల్డ్‌ కార్డు’ ప్లేయర్‌ అలెక్సి పాపిరిన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు.

సుమీత్‌ నాగల్‌ ఓటమి
పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి బరిలో ఉన్న ఏకైక క్రీడాకారుడు సుమీత్‌ నాగల్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. 72వ ర్యాంకర్‌ బెరాన్‌కిస్‌ (లిథువేనియా)తో జరిగిన మ్యాచ్‌లో 144వ ర్యాంకర్‌ సుమీత్‌ 2–6, 5–7, 3–6తో ఓడిపోయాడు. రెండు గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్‌ ఆరుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయాడు. రెండు ఏస్‌లు కొట్టిన 23 ఏళ్ల సుమీత్‌ 42 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి రౌండ్‌లో ఓడిన సుమీత్‌కు 1,00,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 30 వేలు) లభించింది. 

మరిన్ని వార్తలు