బార్టీకి షెల్బీ షాక్‌

6 Sep, 2021 06:12 IST|Sakshi

మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించిన ప్రపంచ నంబర్‌వన్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. సొంత ప్రేక్షకుల నడుమ అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్‌ అద్భుత ఆటతీరుతో యాష్లే బార్టీని బోల్తా కొట్టించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 43వ ర్యాం కర్‌ షెల్బీ రోజర్స్‌ 6–2, 1–6, 7–6 (7/5)తో యాష్లే బార్టీని ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో షెల్బీ 2–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం.

ఎనిమిదో గేమ్‌లో బార్టీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయాన్ని దక్కించుకునేది. కానీ షెల్బీ ధాటికి బార్టీ తొలుత ఎనిమిదో గేమ్‌లో, ఆ తర్వాత పదో గేమ్‌లో తన సరీ్వస్‌లను కోల్పోయింది. వరుసగా రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించిన షెల్బీ స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో చివరి సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో 4–5తో వెనుకబడిన షెల్బీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి బార్టీ కథ ముగించింది. ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసిన బార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది.

క్వార్టర్‌ ఫైనల్లో స్వితోలినా
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–3, 6–3తో 12వ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.  

జొకోవిచ్‌ జోరు
పురుషుల సింగిల్స్‌ విభాగంలోనూ సంచలన ఫలితం నమోదైంది. ఏడో సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా) ఓటమి చవిచూడగా... టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. లాయిడ్‌ హ్యారిస్‌ (దక్షిణాఫ్రికా) 6–4, 6–4, 6–4తో షపోవలోవ్‌ను ఓడించగా... టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6–7 (4/7), 6–3, 6–3, 6–2తో నిషికోరి (జపాన్‌)పై, జ్వెరెవ్‌ 3–6, 6–2, 6–3, 6–1తో జాక్‌ సోక్‌ (అమెరికా)పై విజయం సాధించారు.  

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట
పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేíÙయా) జోడీ 6–3, 4–6, 6–4తో హుగో నిస్‌ (మొనాకో) –రిండెర్క్‌నిచ్‌ (ఫ్రాన్స్‌) జంటపై గెలిచింది.

మరిన్ని వార్తలు