Ashleigh Barty: శిఖరం నుంచే సాగిపోనీ...

24 Mar, 2022 05:19 IST|Sakshi
క్రికెటర్‌గా యాష్లే బార్టీ

సాక్షి క్రీడా విభాగం: ‘ప్రొఫెషనల్‌ క్రీడల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోకుండానే ఆట నుంచి తప్పుకునే వారు 99 శాతం మంది ఉంటారు. కానీ యాష్లే బార్టీ మిగిలిన ఆ 1 శాతం మందిలో ఉంటుంది’ 25 ఏళ్ల వయసుకే బార్టీ సాధించిన ఘనతలు చూస్తే ఈ వ్యాఖ్య ఆమెకు సరిగ్గా సరిపోతుంది. మూడు వేర్వేరు సర్ఫేస్‌లలో (హార్డ్, క్లే, గ్రాస్‌కోర్టు) మూడు సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్, ఒలింపిక్‌ పతకం, ఓవరాల్‌గా 121 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్, సంపాదనలో మేటి... ఇంకా సాధించడానికి ఏముంది! బార్టీ కూడా ఇలాగే ఆలోచించి ఉంటుంది.

శిఖరాన చేరుకున్న తర్వాత ఇక ఎక్కడానికి ఎత్తులు లేవు అనిపించినప్పుడు ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎలా మొదలు పెట్టామనే దానికంటే ఎలా ముగించామన్నదే ముఖ్యం అని భావిస్తే బార్టీ తన ఘనమైన కెరీర్‌కు అద్భుత రీతిలో గుడ్‌బై పలికింది. సొంతగడ్డపై భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన బార్టీ దానినే చివరి ఘట్టంగా మార్చుకుంది.

నిజానికి కెరీర్‌ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు దానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. దానికి ఎంతో సాహసం, మానసిక దృఢత్వం కావాలి. బార్టీ తాజా ఫామ్, వయసును బట్టి చూస్తే రాబోయే కొన్నేళ్లు ఆమె మహిళల టెన్నిస్‌ను శాసించే స్థితిలో ఉంది. ఆర్జనపరంగా చూస్తే మహిళల వరల్డ్‌ నంబర్‌వన్‌తో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద బ్రాండింగ్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆమె ప్రచార కార్యక్రమాల ద్వారానే లెక్కలేనంత సంపదనను సొంతం చేసుకోవచ్చు.

ఇలాంటివి ఊరిస్తున్నా, వెనక్కి లాగే అవకాశం ఉన్నా బార్టీ ‘ఇట్స్‌ జస్ట్‌ మై వే’ అంటూ తనదైన దారిని ఎం చుకుంది. తన ప్రస్తుత స్థాయి ఏమిటో ఆమె పట్టించుకోలేదు. టెన్నిస్‌ మాత్రమే తనకు ప్రపం చం కాదని, కొత్త కలలను సాకారం చేసుకోవా ల్సి ఉందంటూ ముందుకు వెళ్లేందుకు నిశ్చ యించుకుంది. తానేంటో, తనకు కావాల్సింది ఏమిటో, తాను ఎలా సంతోషంగా ఉండగలనో గుర్తించి దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంది.   

బార్టీ కెరీర్‌ ఆసాంతం ఆసక్తికరం. నాలుగేళ్ల వయసులో రాకెట్‌ పట్టిన ఈ బ్రిస్బేన్‌ అమ్మాయి 14 ఏళ్ల వయసులో ఐటీఎఫ్‌ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత సంవత్సరమే వింబుల్డన్‌ జూనియర్‌ టైటిల్‌ గెలవడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. కేసీ డెలాక్వా తోడుగా మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్‌ చేరగా, సింగిల్స్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. అయితే 2014లో అనూహ్యంగా ఆటకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది.

‘చిన్నప్పటి నుంచే ఆడుతున్న నేను ఇంత ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఒక సాధారణ టీనేజర్‌గా నా జీవితం గడపాలని ఉంది’ అంటూ దాదాపు 18 నెలలు టెన్నిస్‌ నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో క్రికెట్‌పై దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి శిక్షణ లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి ఏకంగా ‘మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌’లో బ్రిస్బేన్‌ హీట్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చిన యాష్లే బార్టీకి వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు.

మరిన్ని వార్తలు