ఫ్రెంచ్‌ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం

9 Sep, 2020 03:31 IST|Sakshi

కరోనాతో సాహసం చేయలేనన్న వరల్డ్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌  

బ్రిస్బేన్‌: ఒకవైపు కరోనా వైరస్‌తో భయం... మరోవైపు సరైన సన్నాహాలు లేకపోవడంతో... తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లోనూ ఆడటంలేదని మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రకటించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన బార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన టోర్నమెంట్‌. కాబట్టి ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు’ అని 24 ఏళ్ల బార్టీ పేర్కొంది.

ప్రేక్షకులు లేకుండానే యూఎస్‌ ఓపెన్‌ జరుగుతుండగా... ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అభిమానులను అనుమతిస్తామని నిర్వాహకులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.  రోమ్‌లో 14 నుంచి జరిగే ఇటాలియన్‌ ఓపెన్‌లోనూ పాల్గొనబోవడం లేదని బార్టీ తెలిపింది. ‘ఈ ఏడాది అందరికీ సవాలుగా నిలిచింది. నేను టెన్నిస్‌లో వెనుకబడినప్పటికీ నా కుటుంబం, నా టీమ్‌ ఆరోగ్య భద్రతే నాకు ప్రధానం. వారిని ఇబ్బంది పెట్టలేను. నాకు మద్దతుగా నిలిచిన నా అభిమానులందరికీ ధన్యవాదాలు. త్వరలోనే మీ కోసం మళ్లీ టెన్నిస్‌ ఆడతా’ అని బార్టీ వివరించింది. ఆమె చివరిసారిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీస్‌లో సోఫియా కెనిన్‌ చేతిలో ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు