జిడ్డు బ్యాటింగ్‌ అమ్మ మొగుడు.. 400 నిమిషాలు క్రీజ్‌లో ఉండి..!

25 Mar, 2023 16:37 IST|Sakshi

131 ఏళ్ల షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ చరిత్రలో అత్యంత జిడ్డు బ్యాటింగ్‌ ప్రస్తుత సీజన్‌లో నమోదైంది. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న షీల్డ్‌ 2022-23 ఫైనల్లో విక్టోరియా ఆటగాడు ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి, 280 బంతులను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విక్టోరియా 195 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన చంద్రసింఘే చివరి దాకా అజేయంగా క్రీజ్‌లో నిలబడి ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్‌ ఫైనల్లో కనీసం 250 బంతులను ఎదుర్కొని చివరి దాకా అజేయంగా క్రీజ్‌లో నిలబడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

1997-98 సీజన్‌ ఫైనల్లో టాస్మానియా ఆటగాడు జేమీ కాక్స్‌ 267 బంతులు ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచాడు.  ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరిన్ని  రికార్డులు కూడా కొల్లగొట్టాడు. షీల్డ్‌ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేయకుండా షీల్డ్‌ ఫైనల్లో చివరి వరకు క్రీజ్‌లో నిలబడిన ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. 16.43 స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన చంద్రసింఘే.. తొలి పరుగు చేసేందుకు ఏకంగా 49 బంతులు తీసుకోవడం కూడా ఓ రికార్డే.

కాగా, చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్‌ను కొందరు విమర్శిస్తుంటే, మరికొందరేమో ప్రశంశిస్తున్నారు. చంద్రసింఘే ఓపికగా క్రీజ్‌లో నిలబడిన విధానాన్ని టెస్ట్‌ క్రికెట్‌ ప్రేమికులు ఆకాశానికెత్తుతున్నారు. శ్రీలంక బీజాలు కలిగిన చంద్రసింఘే కుమార సంగక్కర, మైక్‌ హస్సీలను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాడు.

ఇదిలా ఉంటే, షీల్డ్‌ ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విక్టోరియా 2 పరుగుల లీగ్‌లో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 195 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అంతకుముందు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది. 

మరిన్ని వార్తలు