Ashton Agar: చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు

17 Nov, 2022 13:06 IST|Sakshi

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య​ వివాదం పెరగడంతో సహనం కోల్పోయిన అగర్‌ అంపైర్‌ను బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. క్రీజులో కుదురుకున్న డేవిడ్‌ మలాన్‌, సామ్‌ బిల్లింగ్స్‌ జోడిని విడదీయడానికి కమిన్స్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ చేతికి బంతినిచ్చాడు.

బంతితో వికెట్లు తీయాల్సింది పోయి.. బంతి వేసిన తర్వాత పదే పదే పిచ్‌పైకి వస్తూ బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఇది చూసిన ఫీల్డ్‌ అంపైర్‌ పాల్ రీఫెల్ అగర్‌ను హెచ్చరించాడు. ''పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్‌ కాదు..'' అంపైర్‌ అనడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఇది విన్న అగర్‌ వెంటనే.. ''మీరు అనేది ఏంటి.. నేను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్నా'' అంటూ సమాధానమిచ్చాడు.

అగర్‌ సమాధానంతో ఏకీభవించని అంపైర్‌.. ''బ్యాటర్‌ బంతిని కొట్టింది మిడ్‌ వికెట్‌ వైపు.. నువ్వు పిచ్‌పైకి ఎందుకు వస్తున్నావు.. అంటే బ్యాటర్‌ను అడ్డుకోవడానికే కదా'' అంటూ తెలిపాడు. ఇది విన్న అగర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అంపైర్‌ మీదకు దూసుకొచ్చిన అగర్‌ అసభ్యకరమైన పదంతో దూషించాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. ఆ తర్వాత కూడా అగర్‌, పాల్‌ రీఫెల్‌లు వాదులాడుకోవడం కనిపించింది. అయితే ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగినందుకు ఆస్టన్‌ అగర్‌కు జరిమానా పడే అవకాశం ఉంది.

ఇక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఆదిలోనే శుభారంభం ఇచ్చాడు. 14 పరుగులు చేసిన ఫిల్‌ సాల్ట్‌ను పెవిలియన్‌ చేర్చగా.. ఆ తర్వాత మిచెల్‌ స్టార్క్‌ జేసన్‌ రాయ్‌ను ఆరు పరుగుల వద్ద సూపర్‌ బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే ఒక ఎండ్‌లో డేవిడ్‌ మలాన్‌ స్థిరంగా ఆడడంతో ఇంగ్లండ్‌ స్కోరుబోర్డు ముందుకు కదిలింది.

సామ్‌ బిల్లింగ్స్‌, కెప్టెన్‌ బట్లర్‌లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన మలాన్‌ శతకంతో మెరిశాడు. 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో డేవిడ్‌ విల్లే 40 బంతుల్లో 34 నాటౌట్‌ దాటిగా ఆడడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌, స్టోయినిస్‌ చెరొక వికెట్‌ తీశారు.   

చదవండి: Video: స్టార్క్‌ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్‌ వీడియో

ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?

మరిన్ని వార్తలు