అశ్విన్‌కే సాధ్యమైంది...

12 Jan, 2021 10:37 IST|Sakshi

ఛాతీపై, భుజాలపై, పొత్తి కడుపుపై, పక్కటెముకలపై, మోచేతిపై... ఇవేమీ శత్రువు కత్తి పోట్ల గాయాలు కావు! ఆస్ట్రేలియా బౌలర్లు సంధించిన పదునైన బంతుల కారణంగా అశ్విన్‌కు తగిలిన దెబ్బలు ఇవి. ‘ప్రతికూల పరిస్థితుల్లో మా అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది’... ఆదివారం ఈ వ్యాఖ్య చేసిన అశ్విన్‌ సోమవారం దానిని చేసి చూపించాడు. అతని భార్య ప్రీతి చెప్పినదాని ప్రకారం... రాత్రంతా వెన్ను నొప్పితో బాధపడిన అశ్విన్‌ సరిగా కూర్చోలేకపోయాడు. షూ లేస్‌ కట్టడం కూడా కష్టంగా మారింది. సోమవారం బ్యాటింగ్‌కు వెళ్లే ముందు, టీ విరామ సమయంలో కూడా అతను పూర్తిగా నిలబడే ఉన్నాడు. కానీ ఏం జరిగినా ఓటమిని అంగీకరించని అశ్విన్‌ తత్వం భారత్‌ను ఓటమి భారం నుంచి తప్పించింది. ఎలాగైనా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలని సంకల్పంతో బరిలోకి దిగిన అతను తన పట్టుదలను చూపించాడు.(స్టీవ్‌ స్మిత్‌..  మళ్లీ చీటింగ్‌ చేశాడు..!)

ముగ్గురు టాప్‌ పేసర్లు విరుచుకుపడుతున్నా అతను వెన్ను చూపలేదు. చివరి సెషన్‌లో ఆసీస్‌ బౌలర్లు తొలి బంతి నుంచే బౌన్సర్లతో అశ్విన్‌పై విరుచుకుపడ్డారు. కమిన్స్‌ బంతి పక్కటెముకలకు తగిలిన సమయంలోనైతే అతను విలవిల్లాడిపోయాడు. ఫిజియో చికిత్స చేయాల్సి వచ్చింది. ఆపై పదే పదే తన చెస్ట్‌ గార్డ్‌ను సరి చేసుకుంటూ అతను జాగ్రత్త పడ్డాడు. ఏ బంతి ఆడినా ఫీల్డర్‌ చేతుల్లో పడుతుందేమో అన్నంత తీవ్ర ఒత్తిడిలో ఆడిన అశ్విన్‌ చివరకు తన బ్యాటింగ్‌ సత్తా ప్రదర్శించాడు. ఆసీస్‌ బౌలర్లకు మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండా కొన్ని చక్కటి షాట్లు ఆడి జట్టును గట్టెక్కించాడు. అశ్విన్‌ టెస్టు కెరీర్‌లో నాలుగు సెంచరీలు ఉన్నా... వాటితో పోలిస్తే ఇక్కడ సాధించిన పరుగుల విలువే ఎక్కువ! (విహారి పోరాటం అదిరింది.. ఆసీస్‌ అలసింది)

మరిన్ని వార్తలు