Ravichanrdan Ashwin: 'వాళ్లు కూడా మనుషులే కదా.. అందుకే విశ్రాంతి'

20 Nov, 2022 11:38 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం తర్వాత జట్టులోని సీనియర్‌  ఆటగాళ్లు సహా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ విశ్రాంతి వ్యవహారంపై పెద్ద దుమారం నడుస్తోంది. టి20 ప్రపంచకప్‌లో ఎందుకు విఫలమయ్యామన్న విషయాలు ఆలోచించకుండా కోచ్‌ ద్రవిడ్‌ పదే పదే విరామం తీసుకోవడం ఏంటని మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో వన్డే, టి20 సిరీస్‌కు కోచ్‌ ద్రవిడ్‌ సహా సపోర్ట్‌ స్టాఫ్‌ దూరంగా ఉండడంతో అతని స్థానంలో ఎన్‌సీఏ హెడ్‌.. వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటు అతని సిబ్బంది బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా కోచ్‌ ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకోవడంపై టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. 

''ద్రవిడ్‌కు విశ్రాంతినివ్వడం.. లక్ష్మణ్‌ ఆ బాధ్యతలను భుజాలకెత్తుకోవడం వంటి అంశాలను ఇక్కడ మరో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే దీనిపై నేను స్పందించాల్సి వస్తోంది.క్రికెట్‌లో ఒక ఆటగాడికైనా.. కోచ్‌కైనా, సహాయక సిబ్బందికైనా మానసిక ప్రశాంతత కోసం రెస్ట్‌ తప్పనిసరి. ఆటగాళ్లకు మాత్రమే విశ్రాంతి ఇస్తే సరిపోదు.. మనతో పాటు ఉండే కోచ్‌, సహాయక సిబ్బంది కూడా మనుషులే.. యంత్రాలు కాదు. అందుకే విశ్రాంతి అవసరం.

ప్లానింగ్‌ నుంచి మొదలుకొని టి20 ప్రపంచకప్‌ పూర్తయ్యేవరకు ద్రవిడ్‌ అతడి బృందం తీవ్రంగా శ్రమించింది. అది నేను కళ్లారా చూశాను. ప్రతి ఒక్క మ్యాచ్‌కు వారికి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. అది శారీరకంగానే కాక మానసికంగా కూడా వారి శక్తిని హరిస్తుంది,. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరికి విశ్రాంతి అవసరం. కివీస్‌ సిరీస్‌ అయిపోగానే బంగ్లా పర్యటన ఉంది. అందుకే లక్ష్మణ్‌ నేతృత్వంలో కొత్త టీం కివీస్‌తో సిరీస్‌కు పనిచేస్తోంది. భారత్‌ క్రికెట్‌లో ఎంతో మంది ప్రతిభగలవారు ఉన్నారు. ఆటగాళ్లగానే కాకుండా కోచింగ్‌ పరంగా కూడా కొత్త వారికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం'' అంటూ అశ్విన్‌ పేర్కొన్నాడు.

చదవండి: BCCI: కొత్త చీఫ్‌ సెలక్టర్‌ ఎవరంటే..?

మరిన్ని వార్తలు