ఐసీసీ అవార్డు రేసులో ముగ్గురు.. విజేత ఎవరో!

2 Mar, 2021 17:51 IST|Sakshi

దుబాయ్‌: గత జనవరి చివరి వారంలో ఐసీసీ కొత్తగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పురుషులతో పాటు మహిళ క్రికెటర్లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్‌ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. అందులో టీమిండియా నుంచి ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ ఉన్నారు. ఐసీసీ వెబ్‌సైట్‌ ద్వారా అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఓటింగ్‌ ఆధారంగా మార్చి 8న అవార్డు ఎవరికి వరిస్తుందో తేలనుంది.

కాగా రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా తరపున ఇంగ్లండ్‌ సిరీస్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో అశ్విన్‌ 106 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లోనూ 8 వికెట్లతో రాణించాడు. అంతేగాక మొటేరా వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో 400 వికెట్ల ఫీట్‌ను అందుకోవడమేగాక ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక రూట్‌ విషయానికి వస్తే.. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో మెరిసి ఇంగ్లండ్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.

వీరిద్దరిని పక్కనపెడితే.. విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ నామినేట్‌ కావడం ఆసక్తి కలిగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మేయర్స్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో(210 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. ఈ ఫీట్‌ను మేయర్స్‌ మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో అందుకోవడం విశేషం. అంతేగాక అతని ఇన్నింగ్స్‌తో విండీస్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో 5వ అత్యధిక స్కోరును చేధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. వీరితో పాటు మహిళా క్రికెటర్లలో ఇంగ్లండ్‌ నుంచి టామీ బ్యూమాంట్ ,నాట్ సైవర్, బ్రూక్‌ హిల్లాడే( న్యూజిలాండ్‌) 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్'‌‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.
చదవండి: 'అందుకే ఐపీఎల్‌ నుంచి పక్కకు తప్పుకున్నా'
దుమ్మురేపిన అశ్విన్‌.. కెరీర్‌ బెస్ట్‌కు రోహిత్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు