అశ్విన్‌ వదిలేశాడు.. కెమెరాలన్నీ పాంటింగ్‌వైపే!

5 Oct, 2020 23:36 IST|Sakshi

దుబాయ్‌: గతేడాది జరిగిన ఐపీఎల్‌లో  రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను ‘మన్కడింగ్‌’ ద్వారా ఔట్‌ చేసి రవిచంద్రన్‌ అశ్విన్‌ వివాదానికి తెరలేపాడు. అప్పుడు అశ్విన్‌ కింగ్స్‌ పంజాబ్‌  కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈ ఏడాది అశ్విన్‌ ఫ్రాంచైజీ మారింది.. మనసు కూడా మారింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌.. మన్కడింగ్‌(నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌ దాటినప్పుడు చేసే రనౌట్‌) అవకాశం వచ్చినా దాన్ని వదిలేశాడు. కేవలం వార్నింగ్‌తో సరిపెట్టి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న అరోన్‌ ఫించ్‌ క్రీజ్‌ను దాటి ఆమడ దూరం వెళ్లాడు. కానీ అశ్విన్‌ మన్కడింగ్‌కు ప్రయత్నించలేదు. బంతిని వేయడం ఆపేసి ఫించ్‌కు మర్యాదగా వార్నింగ్‌ ఇచ్చాడు. అదే సమయంలో అంపైర్‌ వైపు చూస్తూ చిరునవ్వులు చిందించాడు అశ్విన్‌. (చదవండి: ఐపీఎల్‌ 2020: ఢిల్లీ ‘టాప్‌’ లేపింది)

గతేడాది మన్కడింగ్‌ వివాదంపై ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా స్పందించాడు. దీనిపై అశ్విన్‌తో కూడా మాట్లాడి ఇది గేమ్‌ ఆఫ్‌ ద స్పిరిట్‌ కాదని చెప్పాడు. దీనికి ఐదు పరుగుల పెనాల్టీ విధించాలని పాంటింగ్‌ వాదించాడు. ఈ నిబంధనను తీసుకురావాలన్నాడు. కాగా ఇప్పుడు అశ్విన్‌ మన్కడింగ్‌ అవకాశాన్ని వదిలేయడంతో కామెంటేటర్లు చమత్కరిస్తూ మాట్లాడారు. మళ్లీ అశ్విన్‌కు మన్కడింగ్‌ అవకాశం వచ్చిందని కామెంట్‌ చేస్తూనే.. ఈసారి వార్నింగ్‌తో సరిపెట్టడంతో కామెంటరీ బాక్స్‌లో జోక్‌లు పేలాయి. అదే సమయంలో కెమెరాలన్నీ డగౌట్‌లో ఉన్న రికీ పాంటింగ్‌ వైపు మళ్లాయి. అయితే పాంటింగ్‌ మాత్రం దీనిపై నవ్వాలా.. వద్దా అన్నట్లు ముఖాన్ని బిగపెట్టి తనదైన శైలిలో నవ్వుకున్నాడు.

మరిన్ని వార్తలు