Asia Cup 2022 AFG VS SL: రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌ చేసిన ఆఫ్ఘాన్‌ యువ బ్యాటర్‌.. ఆసియా కప్‌లో ఇదే బెస్ట్‌

4 Sep, 2022 12:29 IST|Sakshi

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 3) ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. ఆఫ్ఘాన్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి గ్రూప్‌ దశలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌కు శుభారంభం లభించినా.. ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టలేక భారీ స్కోర్‌ చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడి 19.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ యువ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌ ఓడినా గుర్భాజ్‌నే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది. 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న గుర్భాజ్‌.. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా పలు రికార్డులకు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘాన్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డుతో (22 బంతుల్లో) పాటు ఆసియా కప్‌ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

ఆసియాకప్‌ టీ20ల్లో అత్యధిక స్కోర్‌ రికార్డు గతంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2016లో బంగ్లాదేశ్‌పై 55 బంతుల్లో 83 పరుగులు) పేరిట ఉండేది. నిన్నటి మ్యాచ్‌తో గుర్భాజ్‌ రోహిత్‌ రికార్డును బద్దలు కొట్టి ఆసియా కప్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న గుర్భాజ్‌.. 3 మ్యాచ్‌ల్లో 167 స్ట్రయిక్‌ రేట్‌తో 45 సగటున 135 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంకపై తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 40 పరుగులతో విధ్వంసం సృష్టించిన గుర్భాజ్‌.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో (11) జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 
చదవండి: 'ఆడింది చాలు పెవిలియన్‌ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం

Poll
Loading...
మరిన్ని వార్తలు