Asia Cup 2022 PAK VS AFG: క్రూరంగా ప్రవర్తించిన ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌.. పాక్‌ అభిమానులపై చైర్లతో దాడి

8 Sep, 2022 12:52 IST|Sakshi

ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 7) పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ పదో నంబర్‌ ఆటగాడు నసీమ్‌ షా ఆఖరి ఓవర్‌లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌ను గెలిపించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్‌ చేతుల్లోనే ఉన్న మ్యాచ్‌ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్‌ వీర విజృంభణ ధాటికి పాక్‌ వశమైంది.

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ చేసింది 129 పరుగులే అయినప్పటికీ.. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘాన్‌ ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. 

అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్‌ అభిమానులు మాత్రం ఓవరాక్షన్‌ చేశారు. మ్యాచ్‌ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. కుర్చీలు విరుగగొట్టి, పాక్‌ అభిమానులపై దాడులు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అప్పటివరకు పాక్‌ అభిమానులతో కలిసి మ్యాచ్‌ చూసిన ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారిగా పేట్రేగిపోయి తాలిబన్లలా అమానవీయంగా వ్యవహరించారు. కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం సృష్టించారు. ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు పాక్‌ అభిమానులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియం నుంచి దౌడు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ఏ క్రీడలోనైనా గెలుపోటములు సహజమని, వాటిని క్రీడా స్పూర్తితో స్వీకరించాలే కానీ ఇలా దాడులకు దిగడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. జెంటిల్మెన్‌ గేమ్‌లో ఇలాంటి చర్యలను సహించకూడదని, ఆఫ్ఘన్‌ అభిమానులను స్టేడియాల్లోకి రానీయకుండా నిషేధించాలని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించడాన్ని మాత్రం భారత అభిమానులు తప్పుపడుతున్నారు. అక్తర్‌ ఆఫ్ఘన్‌ అభిమానుల దుశ్చర్యను ఖండిస్తూ, హిత బోధ చేయడంపై టీమిండియా ఫ్యాన్స్‌ ఫైరవుతున్నారు. అక్తర్‌ చిలకపలుకులు పలికింది చాలు.. ముందు మీ ఆటగాళ్లను ప్రవర్తన సరిచేసుకోమని చెప్పు అంటూ ఆసిఫ్‌ అలీ-ఆఫ్ఘన్‌ బౌలర్‌ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ఫరీద్ అహ్మద్‌ను ఆసిఫ్‌ అలీ బ్యాట్‌తో కొట్టబోయాడు. 
చదవండి: మహ్మద్‌ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్‌లో తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు