Asia Cup 2022: 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్‌

16 Aug, 2022 18:45 IST|Sakshi
అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు(PC: Afghanistan Cricket)

ఆసియా కప్‌-2022 టోర్నీకి అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా జరుగబోయే మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది. కాగా ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ సారథ్యంలోని అఫ్గనిస్తాన్‌ ప్రస్తుతం ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం అక్కడికి వెళ్లిన జట్టులో కేవలం ఒకే ఒక మార్పుతో నబీ బృందం ఆసియా కప్‌ బరిలోకి దిగనుంది. షరాఫుద్దీన్‌ ఆష్రఫ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ సమీఉల్లా శిన్వారీ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. అష్రఫ్‌ను రిజర్వు ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా శిన్వారీ 2020 మార్చిలో ఐర్లాండ్‌తో చివరిగా సారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

సుదీర్ఘ విరామం తర్వాత
దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏకంగా మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. అయితే.. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అతడిని ఆసియా కప్‌ జట్టుకు ఎంపిక చేసినట్లు అఫ్గనిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ నూర్‌ మాలిక్‌జాయ్‌ తెలిపాడు. ఇక 17 ఏళ్ల లెఫ్టార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌కు కూడా జట్టులో స్థానం దక్కడం విశేషం.

కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్‌ టోర్నీ సాగనుంది. మరోవైపు.. ఆగష్టు 17న ఆఖరి టీ20తో అఫ్గన్‌ జట్టు ఐర్లాండ్‌ పర్యటనను ముగించనుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలిచి 2-2తో సమంగా ఉన్నాయి. 

ఆసియా కప్‌-2022కు అఫ్గనిస్తాన్‌ జట్టు:
మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌), హజార్తుల్లా జజాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, అఫ్సర్‌ జజాయ్‌, కరీం జనత్‌, అజ్మతుల్లా ఓమర్జాయ్‌, సమీఉల్లా శిన్వారీ, రషీద్‌ ఖాన్‌, ఫాజల్‌ హక్‌ ఫరూకీ, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌.

రిజర్వు ప్లేయర్లు:
కైస్‌ అహ్మద్‌, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, నిజత్‌ మసూద్‌.
చదవండి: Abudhabi Night Riders ILT20: కేకేఆర్‌ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌..
Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్‌, జట్ల వివరాలు.. తాజా అప్‌డేట్లు!

మరిన్ని వార్తలు