Asia Cup 2022: శ్రీలంక జట్టుకు భారీ షాక్‌! కీలక బౌలర్‌ దూరం!

22 Aug, 2022 17:16 IST|Sakshi
ఆంటన్‌తో చమీర(PC: Anton Roux)

Asia Cup 2022 Sri Lanka Squad: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌-2022 టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంకకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కీలక బౌలర్‌ దుష్మంత చమీర ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. టీమ్‌ ప్రాక్టీసు సందర్భంగా అనుకోకుండా అతడికి గాయమైంది. ఎడమ కాలి నొప్పి తీవ్రతరం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆంటన్‌ రక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధ్రువీకరించాడు. 

ఈ మేరకు చమీరతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన ఆంటన్‌.. ‘‘నేను ఇప్పటి వరకు కలిసి మంచి వ్యక్తులలో తనూ ఒకడు. ఆట పట్ల అంకితభావం కలవాడు. తను గాయం కారణంగా ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, దుషీ కచ్చితంగా రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తాడని నమ్మకం ఉంది. 

అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ నాటికి తను తిరిగి వస్తాడు. క్రీడాకారులు గాయాలపాలు కావడం సహజమే. అయితే, కోలుకునే క్రమంలో మనల్ని మనం దృఢంగా ఉంచుకోవాలి. త్వరలోనే నిన్ను కలుస్తాము దుషీ’’ అని పేర్కొన్నాడు. దుష్మంత చమీర త్వరగా కోలుకుని జట్టులోకి తిరిగి రావాలని ఆకాంక్షించాడు. 

కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌-2022 టోర్నమెంట్‌ ఆరంభం కానుంది. దుబాయ్‌ వేదికగా జరుగనున్న ఈవెంట్‌ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక.. అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇక కీలక పేసర్‌ చమీర దూరం కావడం లంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. చమీర స్థానంలో నువాన్‌ తుషార జట్టులోకి రానున్నాడు.

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన చమీర.. అదే ఏడాది పాకిస్తాన్‌తో సిరీస్‌తో టెస్టుల్లో, విండీస్‌తో మ్యాచ్‌తో టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 44, టెస్టుల్లో 32, టీ20లలో 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సహా హర్షల్‌ పటేల్‌.. పాకిస్తాన్‌ కీలక బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది సైతం ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. 

చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌
Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక

A post shared by Anton Roux (@_anton_roux)

మరిన్ని వార్తలు