Asia Cup 2022: జాతీయ జెండాను ముట్టుకోని జై షా.. కారణం ఇదేనా..!

29 Aug, 2022 17:21 IST|Sakshi

ఆసియా కప్‌ 2022లో భాగంగా నిన్న (ఆగస్ట్‌ 28) దాయాది పాక్‌తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన.. పాక్‌ను మట్టికరిపించిన అనంతరం స్టేడియంలో తారసపడిన ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా వ్యవహరించిన తీరు అతని తండ్రి ప్రత్యర్ధులకు ఆయుధంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరకాల ప్రత్యర్ధితో నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా విజయానంతరం సంబురాలు అంబరాన్నంటాయి. స్టేడియంలోని ప్రేక్షకులు జాతీయ జెండాలు చేతబూని, సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ భారత దేశ ఖ్యాతి విశ్వమంతా తెలిసేలా ఎలుగెత్తి చాటారు. 

ఈ క్రమంలో స్టేడియంలోనే ఉన్న జై షాకు ఓ అభిమాని త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇందుకు జై షా నిరాకరిస్తూనే.. చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించాడు. జై షా ఇలా ప్రవర్తించడం ప్రతి భారత అభిమానికి అగ్రహం తెప్పించింది. జై షా వ్యవహరించిన తీరును అతని తండ్రి ప్రత్యర్ధులు ఏకి పారేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి తనయుడి దేశ భక్తి ఇదేనా అంటూ మాటల తూటాలు సంధిస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారు.

అసలు కారణం ఇది!
అయితే జై షా విమర్శించడాన్ని ఆయన ఆప్తులు మాత్రం తప్పుపడుతున్నారు. విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. జై షా కేవలం బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదని.. ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడు అన్న విషయం తెలుసుకుని మాట్లాడాలని.. కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని కొందరు మాత్రం జై షాను, ఆయన తండ్రిని టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. 
చదవండి: గంభీర్‌ను ఎవరూ ఇష్టపడే వారు కాదన్న అఫ్రిది.. భజ్జీ రియాక్షన్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు