Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్‌ స్కోరర్లను వదిలేసి..

10 Aug, 2022 12:47 IST|Sakshi

Asia Cup 2022 India Squad: టీ20 ప్రపంచకప్‌-2022కు సన్నాహకంగా భావిస్తున్న మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఆసియా కప్‌-2022నకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు మాజీ సెలక్టర్లు, మాజీ ఆటగాళ్లతో పాటు.. అటు అభిమానులు సైతం భారత జట్టు సెలక్షన్‌పై పెదవి విరుస్తున్నారు.

చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. మరి నిజంగానే ఆసియా కప్‌ ఈవెంట్‌కు బీసీసీఐ సెలక్ట్‌ చేసిన టీమిండియా మరీ అంత దారుణంగా ఉందా?

ఒకవేళ రాహుల్‌ దూరమైతే!
ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌నకు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. దీని ఆధారంగా.. ఎప్పటిలాగే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విరాట్‌ కోహ్లి తిరిగి వచ్చాడు. మూడో స్థానంలో.. అతడు బ్యాటింగ్‌కు రావడం దాదాపు ఖాయమే.

ఇక మిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా ఉండనే ఉన్నారు. కాగా ఇప్పటి వరకు కేఎల్‌ రాహుల్‌ ఇంకా ఫిట్‌నెస్‌ నిరూపించుకోనే లేదు. ఒకవేళ అతడు గనుక ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైతే ఓపెనర్‌గా ఎవరు ఆడతారనేది ప్రశ్న?

వాళ్లు ముగ్గురు ఉన్నారు.. మరి మిడిలార్డర్‌లో..
ఇటీవల ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా బ్యాటర్లు దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. అయితే, టాపార్డర్‌లో కంటే మిడిలార్డర్‌లో వీరి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది.

ఒకవేళ ఏదేని కారణాల వల్ల రాహుల్‌ జట్టుకు దూరమైతే... వీరిలో ఎవరో ఒకరు ఓపెనర్‌గా వచ్చినా.. మిడిలార్డర్‌లో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

నిజంగా ఇది పెద్ద తప్పే!
అంతర్జాతీయ టీ20లలో ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ది మొదటి స్థానం. ఇప్పటి వరకు వివిధ సిరీస్‌లలో భాగమైన అతడు మొత్తంగా 449 పరుగులు(14 ఇన్నింగ్స్‌లో) చేశాడు.

ఈ జాబితాలో శ్రేయస్‌ తర్వాతి స్థానం ఇషాన్‌ కిషన్‌దే. ఈ యువ ఓపెనర్‌ ఇప్పటి వరకు 430 పరుగులు సాధించాడు. అయితే, వీళ్లిద్దరిలో ఏ ఒక్కరిని కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. శ్రేయస్‌ స్టాండ్‌ బైగా ఉన్నా.. ఇషాన్‌ను మొత్తంగా పక్కనపెట్టేశారు. 

ఒకవేళ వీళ్లిద్దరిలో ఒక్కరు ప్రధాన జట్టులో ఉన్నా ఇటు ఓపెనింగ్‌, అటు మిడిలార్డర్‌లో సమస్య ఉండేదే కాదు. అంతేకాదు.. వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు బదులు ఇటీవల వరుస సిరీస్‌లలో రాణించిన సంజూ శాంసన్‌ను సెలక్ట్‌ చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతా ‘రవి’మయం..
ఆసియా కప్‌-2022కు ఎంపిక చేసిన భారత జట్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, యజువేంద్ర చహల్‌ను సెలక్ట్‌ చేశారు. అయితే, అదే సమయంలో ఇటీవల బ్యాటింగ్‌తోనూ అదరగొడుతున్న అక్షర్‌ పటేల్‌కు మాత్రం ప్రధాన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

రవి బిష్ణోయిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఐపీఎల్‌-2022లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. అదే విధంగా ఇటీవలి సిరీస్‌లలోనూ తన స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మాజీ సెలక్టర్‌ కిరణ్‌ మోరే వంటి వారు సహజంగానే అశ్విన్‌ ఎంపికను తప్పుబడుతున్నారు.

చహర్‌ ఉన్నాడు కదా!
ఈ నేపథ్యంలో అక్షర్‌ను స్టాండ్‌బైగా కాకుండా ప్రధాన జట్టుకు ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా.. ఒకవేళ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయలేని పరిస్థితి తలెత్తితే.. ఆవేశ్‌ ఖాన్‌కు బదులు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ గాయాల కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌ పేసర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీపక్‌ చహర్‌ను సెలక్టర్లు స్టాండ్‌ బైగా ఎంపిక చేశారు. కాగా గాయం కారణంగా దీపక్‌ చహర్‌ ఐపీఎల్‌-2022కు దూరమైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు ఆవేశ్ తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ మెగా టోర్నీలో అతడు ఎంతవరకు రాణిస్తాడో వేచి చూడాలి.

మరోవైపు.. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని విస్మరించడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని ఎంపిక చేయాల్సిందని కొంతమంది అంటుండగా.. టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులోనైనా చోటు ఇస్తారేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆసియా కప్‌ 2022: బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తిక్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌.
స్టాండ్‌ బై ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌

చదవండి: Asia Cup 2022: కేఎల్‌ రాహుల్‌ కోలుకున్నాడు.. కానీ..! 
Trent Boult: న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకున్న స్టార్‌ బౌలర్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు