Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్‌.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే?

24 Aug, 2022 16:59 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎందురు చూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. దాయాదుల పోరుకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆసియాకప్‌-2022లో భాగంగా ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా భారత్‌-పాక్‌ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి.

అయితే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కూడా పాకిస్తాన్‌పైనే అడునున్నాడు. అయితే గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కోహ్లి పాక్‌ మ్యాచ్‌తోనే తిరిగి బరిలోకి దిగనున్నాడు.

ఆసియాకప్‌లో తిరుగులేని కోహ్లి
ఇక ఆసియా కప్‌ టోర్నీలో కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. 2010లో తొలిసారిగా ఆసియాకప్‌లో అడుగుపెట్టిన కోహ్లి తనకంటూ ఒక స్టార్‌డమ్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పటివరకు ఆసియాకప్‌ వన్డే ఫార్మాట్‌లో 14 మ్యా్‌చ్‌లు ఆడిన కోహ్లి 766 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

ఇక 2012 ఎడిషన్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి భారీ సెంచరీతో చేలరేగాడు. ఈ మ్యాచ్‌లో 183 పరుగులు సాధించిన కోహ్లి.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోహ్లి ఇప్పటి వరకు 2010 ,2012, 2014, 2016లో జరిగిన ఆసియాకప్‌ ఈవెంట్‌లో భాగంగా ఉన్నాడు. 2014లో జరిగిన ఆసియాకప్‌ టోర్నీకి భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరించాడు. కాగా యూఏఈ వేదికగా జరిగిన 2018 ఎడిషన్‌కు విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.

ఇక ఆసియాకప్‌ టీ20 ఫార్మాట్‌ విషయానికి వస్తే.. కోహ్లి ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 153 పరుగులు సాధించాడు. కాగా ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుండటం 2016 తర్వాత తొలిసారి ఇదే. 2016లో జరిగిన ఈ ఈవెంట్‌లో భారత్‌ ఛాంపియన్‌ నిలిచింది. ఇక ఆసియాకప్‌-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి  జరగనున్న సంగతి తెలిసిందే.


చదవండిASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్‌ కొట్టేశాడు!

>
మరిన్ని వార్తలు