Virat Kohli: 'కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 

8 Sep, 2022 21:00 IST|Sakshi

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు వెయ్యి రోజుల తర్వాత సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆసియా కప్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి తన టి20 కెరీర్‌లో తొలి సెంచరీతో పాటు అత్యధిక  వ్యక్తిగత స్కోరును కూడా అందుకున్నాడు.

ఈ క్రమంలోనే  కోహ్లి టీ20ల్లో వంద సిక్సర్ల మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఇక టి20ల్లో 3500కు పైగా పరుగులను అందుకున్నాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ తర్వాత ఈ రెండు ఫీట్‌లు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇక కోహ్లి కెరీర్‌లో ఇది 71వ సెంచరీ. 522 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 71వ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్‌తో(71 సెంచరీలు, 668 ఇన్నింగ్స్‌లు) కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌( 782 ఇన్నింగ్స్‌ల్లో వంద సెంచరీలు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కుమార సంగక్కర(666 ఇన్నింగ్స్‌ల్లో 63 సెంచరీలు), జాక్వెస్‌ కలిస్‌(617 ఇన్నింగ్స్‌ల్లో 62 సెంచరీలు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

అఫ్గన్‌తో మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉండడంతో కేఎల్‌ రాహుల్‌తో కలిసి కోహ్లి ఓపెనింగ్‌కు వచ్చాడు. తుఫాను వచ్చే ముందు ఎంత నిశబ్దంగా ఉంటుందో అలాగే మొదలైంది టీమిండియా ఇన్నింగ్స్‌. మొదటి మూడు ఓవర్లు కుదురుకోవడానికి టైం తీసుకున్న కోహ్లి ఆ తర్వాత తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న కోహ్లి.. ఆ తర్వాత చేసిన 50 పరుగులకు మాత్రం కేవలం 17 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన కోహ్లి.. వింటేజ్‌ కోహ్లిని గుర్తుకుతెచ్చాడు.

మరిన్ని వార్తలు