Ind Vs Pak: అర్ష్‌దీప్‌ బంగారం.. అతడిని ఏమీ అనకండి.. నిజంగా ఇది సిగ్గుచేటు: భారత మాజీ క్రికెటర్‌

5 Sep, 2022 11:48 IST|Sakshi
పాక్‌తో మ్యాచ్‌లో సహచర ఆటగాళ్లతో అర్ష్‌దీప్‌

Asia Cup 2022 Ind Vs Pak- Arshdeep Singh Drops Catch: టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మద్దతుగా నిలిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ క్యాచ్‌ను వదిలేయరని.. అర్ష్‌దీప్‌ను విమర్శించడం మానుకోవాలని సూచించాడు. పాకిస్తాన్‌ మెరుగ్గా ఆడిన విషయాన్ని గమనించాలని.. అంతేతప్ప భారత జట్టుపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు.

ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. బౌలర్ల వైఫల్యం కారణంగా 181 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా ఆఖర్లో రవి బిష్ణోయి, భువనేశ్వర్‌ కుమార్‌ భారీగా పరుగులు ఇవ్వడం.. కీలక సమయంలో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ నేలపాలు చేయడం పాక్‌కు కలిసి వచ్చింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో గెలుపు పాక్‌ సొంతమైంది.

విమర్శల వర్షం.. అండగా భజ్జీ
ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అర్ష్‌దీప్‌ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి. ఇందుకు ట్విటర్‌ వేదికగా స్పందించిన హర్భజన్‌ సింగ్‌.. విమర్శకుల తీరుపై మండిపడ్డాడు. ఈ మేరకు.. ‘‘అర్ష్‌దీప్‌ సింగ్‌ను నిందించడం ఆపండి. కావాలని ఎవరూ క్యాచ్‌ వదిలేయరు. భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లను చూసి మనం గర్వించాలి.

నిజానికి ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మెరుగ్గా ఆడింది. కానీ అందుకు అర్ష్‌నున, మన జట్టును తప్పుబడుతూ వారిని అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు. అర్ష్‌ బంగారం’’ అని భజ్జీ ట్వీట్‌ చేశాడు.

ఇర్ఫాన్‌ పఠాన్‌, కోహ్లి సైతం
ఇక టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం అర్స్‌దీప్‌కు అండగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచించాడు. అదే విధంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని.. ఒత్తిడి ఉన్నపుడు ఇలాంటివన్నీ సహజమని అర్ష్‌దీప్‌నకు మద్దతుగా నిలిచాడు.

కట్టుదిట్టంగానే బౌలింగ్‌.. కానీ
కాగా పాక్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 3.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. తన వల్ల లైఫ్‌ పొందిన అసిఫ్‌ అలీని అవుట్‌ చేశాడు. రవి బిష్ణోయి మినహా మిగతా బౌలర్లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో ఈ యువ ఫాస్ట్‌బౌలర్‌ మెరుగైన ఎకానమీతో బౌలింగ్‌ చేశాడు. కానీ అసలైన క్యాచ్‌ జారవిడవడం వల్ల విమర్శల పాలవుతున్నాడు.

చదవండి: Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్‌ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు
Asia Cup 2022 - Ind Vs Pak: పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ.. ఎందుకంటే..?

మరిన్ని వార్తలు