Asia Cup Ind Vs Pak: రోహిత్‌ ‘హగ్‌’తో ఆనందంలో మునిగిపోయిన పాక్‌ ఫ్యాన్‌! నువ్వు గ్రేట్‌ భయ్యా!

27 Aug, 2022 16:39 IST|Sakshi
పాక్‌ అభిమానులతో రోహిత్‌ సంభాషణ(PC: Vimal Kumar)

Asia Cup 2022 India Vs Pakistan: టీమిండియా క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వదేశంలోనైనా.. విదేశీ గడ్డ మీద అయినా భారత ఆటగాళ్లు కనిపిస్తే చాలు అభిమానులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే, కొంతమంది మాత్రం మ్యాచ్‌ కోసం కాకుండా తమ ఆరాధ్య క్రికెటర్‌ను చూసేందుకు మాత్రమే మైదానానికి వస్తారంటే అతిశయోక్తి కాదు. 

ఆసియా కప్‌-2022 టోర్నీ ఆరంభం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దాయాది పాకిస్తాన్‌తో ఆగష్టు 28న భారత్‌ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన ప్రాక్టీసులో తలమునకలైంది. 

రోహిత్‌ను కలవడం కోసమే..
ఇందులో భాగంగా శుక్రవారం కెప్టెన్‌ రోహిత్‌, కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయి పర్యవేక్షణలో ట్రెయినింగ్‌ సెషన్‌ జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది అభిమానులు రోహిత్‌ను కలిసేందుకు అక్కడి వచ్చారు. దూరం నుంచే వారి పిలుపులకు స్పందించిన టీమిండియా సారథి.. ఆ తర్వాత వారి విజ్ఞప్తి మేరకు దగ్గరిదాకా వెళ్లాడు.

నెట్‌ అడ్డుగా ఉన్నప్పటికీ అభిమానుల కోరిక నెరవేర్చేందుకు కంచె ఆవలివైపు నుంచే వారికి సెమీ హగ్‌ ఇచ్చాడు. హిట్‌మ్యాన్‌ ఆత్మీయతకు సదరు అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తాము పాకిస్తాన్‌ జట్టుకు మద్దతుదారులం అయినప్పటికీ రోహిత్‌ను చూసేందుకు ప్రత్యేకంగా ఇక్కడిదాకా వచ్చామని చెప్పుకొచ్చారు. 

హిట్‌మ్యాన్‌ ఆటంటే తమకు ఇష్టమని.. ఇలా అతడిని నేరుగా కలవడం జీవితంలో మర్చిపోలేమంటూ ఆనందం వ్యక్తం చేశారు. తమ జట్టులో ఇప్పుడు షాహిన్‌ ఆఫ్రిది లేడని.. అంతా కొత్త బౌలర్లే కాబట్టి కాస్త కనికరం చూపాలంటూ సరదాగా విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్టు విమల్‌ కుమార్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇది చూసిన హిట్‌మ్యాన్‌ అభిమానులు.. ‘‘రోహిత్‌ ఎవరినైనా ఒకేలా ట్రీట్‌ చేస్తాడని.. హుందాగా వ్యవహరిస్తాడనడానికి మరో నిదర్శనం. నువ్వు గ్రేట్‌ భయ్యా’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. దీపక్‌ హుడాకు నో ఛాన్స్‌! అశ్విన్‌కు కూడా!
Virat Kohli: ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించడమే లక్ష్యంగా ముందుకు.. కానీ: కోహ్లి

మరిన్ని వార్తలు