Asia Cup 2022 IND VS SL Super 4 Match: పంత్‌, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!

5 Sep, 2022 16:58 IST|Sakshi

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 4) పాకిస్తాన్‌తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీమిండియా ఆటగాళ్లు చేజేతులా జారవిడిచి ప్రత్యర్ధికి చేతికి అప్పగించారు. తొలుత బ్యాటింగ్‌లో అత్యుత్సాహం (పంత్‌, హార్ధిక్‌ చెత్త షాట్‌ సెలెక్షన్‌), అనంతరం బౌలింగ్‌ (భువీ, హార్ధిక్‌, చహల్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం), ఫీల్డింగ్‌లో (కీలక సమయంలో అర్షదీప్‌ క్యాచ్‌ జారవిడచడం) అనవసర తప్పిదాలు టీమిండియా పుట్టి ముంచాయి. పాక్‌ చేతిలో ఈ ఊహించని పరాభవం నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని భారత అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. 

సూపర్‌-4 దశలో తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌, స్పిన్నర్‌ చహల్‌లపై వేటు వేయడం ఉత్తమమని టీమిండియా యాజమాన్యాన్ని సూచిస్తున్నారు. రేపు (సెప్టెంబర్‌ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పంత్‌, చహల్‌లను పక్కకు పెట్టి వారి స్థానాల్లో దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌లను ఆడించాలని కోరుతున్నారు. లెఫ్ట్‌ హ్యాండర్‌ కోటాలో ఎంపిక చేసిన పంత్‌.. రైట్‌ హ్యాండర్‌లా షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి (రివర్స్‌ స్వీప్‌) వికెట్‌ పారేసుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చహల్‌ సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడని మండిపడుతున్నారు.  వీరిద్దరిని తీసేసి డీకే, అక్షర్‌లకు అవకాశం ఇస్తే జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా)..
కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్
చదవండి: Asia Cup 2022 Final: అలా అయితేనే ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌! లేదంటే మనం ఇంటికే!
 

Poll
Loading...
మరిన్ని వార్తలు