Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. ఉత్కంఠ పోరులో విజయం

29 Aug, 2022 03:46 IST|Sakshi
PC: BCCI twitter

దుబాయ్‌: ఇదీ దాయాదుల దమ్మంటే. ఈ మ్యాచ్‌కున్న కిక్కే వేరు. బరిలో భారత్, పాక్‌ తలపడితే అది లీగా... నాకౌటా... అనేది ఉండదు! ఎక్కడ ఆడినా... ఎప్పుడు ఎదురుపడినా అది ‘ఫైనల్‌’ను మించిన సమరమే! అలాంటి మ్యాచ్‌ ఆదివారం ఆసియా కప్‌ టి20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఉత్కంఠగా జరిగింది. చివరకు భారత్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. సీమర్లు భువనేశ్వర్‌ (4/26), హార్దిక్‌ పాండ్యా (3/25) పాక్‌ను కట్టడి చేశారు.

తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. కెరీర్‌లో 100వ టి20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు జతచేస్తే... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత జట్టులో అనుభవజ్ఞుడైన దినేశ్‌ కార్తీక్‌ను తీసుకోవడంతో పంత్‌ను పక్కన బెట్టారు. పేసర్లలో అవేశ్‌ఖాన్, అర్‌‡్షదీప్‌లకు అవకాశమిచ్చారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం హాంకాంగ్‌తో ఆడుతుంది. నేడు టోర్నీలో విశ్రాంతి దినం. మంగళవారం జరిగే గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్‌ తలపడుతుంది. 

పాండ్యా బౌన్సర్లు 
కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (10)ను భువీ ఎక్కువసేపు నిలువనీయలేదు. మరో ఓపెనర్‌ రిజ్వాన్‌ కుదురుగా ఆడుతున్నప్పటికీ ఫఖర్‌ జమన్‌ (10)ను అవేశ్‌ఖాన్‌ అవుట్‌ చేశాడు. పవర్‌ప్లేలో పాక్‌ స్కోరు 43/2. రిజ్వాన్, ఇఫ్తికార్‌ అహ్మద్‌ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జోడీ క్రీజులో పాతుకుపోతున్న దశలో హార్దిక్‌ పాండ్యా బౌన్సర్లు పాక్‌ను చావుదెబ్బ తీశాయి. స్వల్ప వ్యవధిలో ఇఫ్తికార్, ఖుష్‌దిల్‌ (2), రిజ్వాన్‌లను హార్దిక్‌ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత భువీ పేస్‌కు మిడిలార్డర్‌ తలవంచింది. ఓ దశలో 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా, ఆఖర్లో షానవాజ్‌ దహని (6 బంతుల్లో 16; 2 సిక్స్‌లు), రవూఫ్‌ (7 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) ఫోర్లు కొట్టడంతో పాక్‌ పోరాడే స్కోరు చేసింది. భారత్‌ మరీ మందకొడిగా బౌలింగ్‌ చేయడంతో చివర్లో పెనాల్టీగా సర్కిల్‌ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గించారు. సాధారణంగా 5 మంది చేసే ఫీల్డింగ్‌ నలుగురికి కుదించారు. ఆ ఫీల్డర్‌ను సర్కిల్‌ లోపలకు తీసుకొచ్చారు. 

రాహుల్‌ డకౌట్‌ 
కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (0) తనకెదురైన తొలి బంతికే నసీమ్‌ షా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కోహ్లి కూడా డకౌట్‌ కావాల్సినోడే! కానీ స్లిప్‌లో ఫఖర్‌ జమన్‌ క్యాచ్‌ నేలపాలు చేయడంతో బతికిపోయాడు. తర్వాత కోహ్లి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. క్లాస్‌ షాట్లతో అలరించాడు. జట్టు స్కోరు 50 పరుగులకు చేరాక మొదట రోహిత్‌ (18 బంతుల్లో 12; 1 సిక్స్‌), కాసేపటికే కోహ్లి భారీ షాట్లకు యత్నించి వికెట్లను సమర్పించుకున్నారు. 53 పరుగులకే టాపార్డర్‌ వికెట్లు పెవిలియన్‌కు చేరాయి. ఈ దశలో జడేజా, సూర్యకుమార్‌ కాసేపు ఓర్పుగా ఆడారు.

చేయాల్సిన రన్‌రేట్‌ పెరగడంతో అడపాదడపా షాట్లు బాదారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్‌ (18 బంతుల్లో 18; 1 ఫోర్‌) వెనుదిరిగాడు. హిట్టర్‌ హార్దిక్‌ పాండ్యా రాగా... 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 97/4. విజయ సమీకరణం 30 బంతుల్లో 51 పరుగులు! అంటే ఓవర్‌కు పది పైచిలుకు పరుగులు చేయాలి. 16, 17వ ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన దశలో నసీమ్‌ షా వేసిన 18వ ఓవర్లో జడేజా ఫోర్, సిక్సర్‌ బాదాడు. తర్వాత రవూఫ్‌ ఓవర్‌ను పాండ్యా 3 బౌండరీలతో ఆడుకున్నాడు. 6 బంతుల్లో 7 పరుగులు. సులువే కానీ... తొలి బంతికి నవాజ్‌ బౌలింగ్‌లో జడేజా బౌల్డ్‌! తర్వాత రెండు బంతుల్లో వచ్చింది ఒకటే పరుగు. మిగిలిన 3 బంతుల్లో గెలవాలంటే 6 పరుగులు చేయాలి. ఉత్కంఠకు తెరదించుతూ హార్దిక్‌ లాంగాన్‌లో కొట్టిన సిక్సర్‌తో ఆట రెండు బంతుల ముందే ముగిసింది. 

ద్రవిడ్‌ వచ్చేశాడు... 
జట్టు బయల్దేరే ముందు అనూహ్యంగా కోవిడ్‌ బారినపడిన టీమిండియా హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ కోలుకున్నాడు. అంతేనా... అప్పుడే ఆసియా కప్‌ ఆతిథ్య దేశం యూఏఈ చేరుకున్నాడు కూడా! ఆ వెంటే జట్టుతో కలిసిన ద్రవిడ్‌ ఉత్సాహంగా తన కోచింగ్‌ పనేదో చక్కబెట్టే పనిలోపడ్డాడు. ‘ద్రవిడ్‌కు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దీంతో వెంటనే దుబాయ్‌ వెళ్లాడు. 

స్కోరు వివరాలు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) అవేశ్‌ ఖాన్‌ (బి) పాండ్యా 43; బాబర్‌ ఆజమ్‌ (సి) అర్‌‡్షదీప్‌ (బి) భువనేశ్వర్‌ 10; ఫఖర్‌ జమాన్‌ (సి) కార్తీక్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 10; ఇఫ్తికార్‌ (సి) కార్తీక్‌ (బి) పాండ్యా 28; ఖుష్‌దిల్‌ షా (సి) జడేజా (బి) పాండ్యా 2; షాదాబ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్‌ 10; ఆసిఫ్‌ అలీ (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 9; నవాజ్‌ (సి) కార్తీక్‌ (బి) అర్‌‡్షదీప్‌ 1; రవూఫ్‌ (నాటౌట్‌) 13; నసీమ్‌ షా (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్‌ 0; షానవాజ్‌ (బి) అర్శ్‌దీప్‌ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 147. వికెట్ల పతనం: 1–15, 2–42, 3–87, 4–96, 5–97, 6–112, 7–114, 8–128, 9–128, 10–147. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–4, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.5–0–33–2, హార్దిక్‌ పాండ్యా 4–0–25–3, అవేశ్‌ ఖాన్‌ 2–0–19–1, చహల్‌ 4–0–32–0, జడేజా 2–0–11–0.  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) నవాజ్‌ 12; రాహుల్‌ (బి) నసీమ్‌ షా 0; కోహ్లి (సి) ఇఫ్తికార్‌ (బి) నవాజ్‌ 35; జడేజా (బి) నవాజ్‌ 35;  సూర్యకుమార్‌ (బి) నసీమ్‌ షా 18; పాండ్యా (నాటౌట్‌) 33; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–1, 2–50, 3–53, 4–89, 5–141. బౌలింగ్‌: నసీమ్‌ షా 4–0–27–2, షానవాజ్‌ 4–0–29–0, రవూఫ్‌ 4–0–35–0, షాదాబ్‌ 4–0–19–0, నవాజ్‌ 3.4–0–33–3.   

మరిన్ని వార్తలు