Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్‌ అయితే..: మాజీ కెప్టెన్‌

9 Aug, 2022 10:49 IST|Sakshi
టీమిండియా (PC: BCCI)

Asia Cup 2022- India Squad Announced: ఆసియా కప్‌-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి స్థానం లేకపోవడం పట్ల టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ తానే గనుక ప్రస్తుత సెలక్టన్‌ టీమ్‌ చైర్మన్‌ అయి ఉంటే కచ్చితంగా షమీకి జట్టులో చోటు ఇచ్చేవాడినని ఈ మాజీ సెలక్టర్‌ పేర్కొన్నాడు. నలుగురు స్పిన్నర్లను తీసుకునే బదులు ఈ వెటరన్‌ పేసర్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

స్టార్ల పునరాగమనం!
కాగా ఆగష్టు 27న ఆరంభం కానున్న ఆసియా కప్‌-2022 ఈవెంట్‌ నేపథ్యంలో బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా.. ఇన్నాళ్లు గాయంతో దూరమైన వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేశాడు. ఇక స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి సహా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజకు కూడా చోటు దక్కింది.

స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా భువనేశ్వర్‌ కుమార్‌ సహా యువ ఫాస్ట్‌ బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌లు జట్టులో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో చిక్కా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కచ్చితంగా అతడికి జట్టులో స్థానం ఉండేది!
ఈ మేరకు.. ‘‘నా జట్టులో అయితే షమీకి కచ్చితంగా చోటు ఉంటుంది. నేను గనుక ఇప్పటి సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఉండి ఉంటే అతడిని ఎంపిక చేసేవాడిని. రవి బిష్ణోయిని పక్కన పెట్టి షమీకి చోటిచ్చేవాడిని. నిజానికి అక్షర్‌ పటేల్‌ కూడా జట్టులో ఉండాల్సింది. అయితే, అశ్విన్‌- అక్షర్‌ పటేల్‌లలో ఎవరంటే సీనియర్‌కే నా ఓటు’’ అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. 


మహ్మద్‌ షమీ(PC: BCCI)

ఏదేమైనా జట్టు ఎంపిక బాగానే ఉందని.. ఇది టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీకి బ్లూ ప్రింట్‌ లాంటిదని చిక్కా అభిప్రాయపడ్డాడు. కేవలం అక్షర్‌ పటేల్‌ విషయంలోనే తాను చింతిస్తున్నానన్న శ్రీకాంత్‌... ఆస్ట్రేలియా పిచ్‌లపై రాణించగల ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు ప్రపంచకప్‌ జట్టులో స్థానం లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దీపక్‌ హుడా సైతం బ్యాట్‌, బాల్‌తో రాణించగలడని.. అందుకే జట్టులో స్థానం దక్కిందని అభిప్రాయపడ్డాడు.

అప్పుడు అలా.. ఐపీఎల్‌-2022లో ఇలా!
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో మహ్మద్‌ షమీ.. ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడిన షమీ.. అరంగేట్ర సీజన్‌లోనే జట్టు విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.

మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు తరఫున అతడికి పొట్టి ఫార్మాట్‌ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్‌ షమీకి సూట్‌ కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ ఈవెంట్‌కు షమీ ఎంపిక కాకపోవడం గమనార్హం.

ఆసియా కప్‌-2022కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తిక్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌.

చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో..
CWG 2022: కోవిడ్‌ అని తేలినా టీమిండియాతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు