Asia Cup 2022: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి!

5 Aug, 2022 08:24 IST|Sakshi

ఆసియా కప్‌ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్‌కు బెస్ట్‌ టీమ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. కాగా ఇటీవలే గాయాలు.. ఫిట్‌నెస్‌ లేమి.. కరోనా కారణంగా జట్టుకు దూరమయిన టీమిండియా వైట్‌బాల్‌ వైస్‌కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కేఎల్‌ రాహుల్‌తో పాటు పేసర్‌ దీపక్‌ చహర్‌ కూడా ఆసియాకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

రెగ్యులర్‌ ఓపెనర్‌ అయిన కేఎల్‌ రాహుల్‌ దూరం కావడంతో రోహిత్‌ శర్మతో కలిసి పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఆరు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ ఆటగాళ్లుగా బరిలోకి దిగారు. సూర్యకుమార్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయినప్పటికి.. కేఎల్‌ రాహుల్‌ వస్తే.. సూర్య మళ్లీ తన పాత స్థానానికే వెళ్లనున్నాడు. ఆసియా కప్‌తోనే కేఎల్‌ రాహుల్‌ టీమిండియా జట్టులోకి రానున్నాడని బీసీసీఐ  సంకేతాలు ఇచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు దుబాయ్‌, షార్జా వేదికల్లో టి20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2022 జరగనుంది. 

''కేఎల్‌ రాహుల్‌ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. అతను ఇప్పటికే క్లాస్‌ ప్లేయర్‌. ఒక టి20 మ్యాచ్‌ ఆడుతున్నాడంటే కచ్చితంగా స్పెషలిస్ట్‌ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు. పంత్‌, సూర్యకుమార్‌లు ఎప్పటిలాగే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు.'' అంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కోహ్లి సంగతేంటి..?
టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ఆసియా కప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు ఇప్పటికే సెలెక్టర్లకు హింట్‌ ఇచ్చాడు. కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న కోహ్లిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపికచేయనుంది. ఆసియాకప్‌తోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని నమ్మితే అతనికి జట్టులో చోటు దక్కుతుంది.  ఒకవేళ కోహ్లి జట్టులోకి ఎంపికైతే.. యథాతధంగా మూడో స్థానంలోనే వస్తాడు. కోహ్లిని పక్కనబెడితే.. వన్‌డౌన్‌లో  ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ దిగనున్నాడు. అయితే ఇషాన్‌ కోహ్లికి బ్యాకప్‌గా ఉంటాడు. ఇక మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌ను బ్యాకప్‌గా ఉంచనున్నారు.
 
ఇక చేతన్‌ శర్మ ఆధ్యరంలోని సెలెక్టర్ల కమిటీ ఆసియా కప్‌కు 15 నుంచి 17 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కేఎల్‌ రాహుల్‌తో పాటు బౌలర్‌ దీపక్‌ చహర్‌ పేరును కూడా పరిశీలిస్తుంది. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసియా కప్‌లో జరగనున్న మ్యాచ్‌లు టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.

ఆసియా కప్‌కు టీమిండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.

బ్యాకప్ బ్యాటర్లు: దీపక్ హుడా/ఇషాన్ కిషన్/సంజు శాంసన్
బ్యాకప్ పేసర్లు: అర్ష్‌దీప్ సింగ్/అవేష్ ఖాన్/దీపక్ చాహర్/హర్షల్ పటేల్.
బ్యాకప్ స్పిన్నర్లు: అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్.

చదవండి: Hardik Pandya May Vice Captain: రోహిత్‌ బాటలోనే కేఎల్‌ రాహుల్‌.. హార్దిక్‌కు ప్రమోషన్‌!

కోహ్లి విషయంలో వాళ్లదే తుది నిర్ణయం: బీసీసీఐ అధికారి

మరిన్ని వార్తలు