Asia Cup 2022: ఇండియా, పాక్‌ క్రికెటర్లకు వైద్య సహాయకుడిగా చెన్నూర్‌ వాసి!

29 Aug, 2022 14:22 IST|Sakshi
అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌తో దుర్గయ్య

Asia Cup 2022- చెన్నూర్‌/మంచిర్యాల జిల్లా: యూఏఈ వేదికగా ఆసియా కప్‌-2022 టోర్నీ ఆరంభమైన విషయం తెలిసిందే. దుబాయ్‌, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక ఈ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లిన ఇండియా, పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్లకు.. వైద్య సహాయకుడిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూర్‌వాసి గాజ దుర్గయ్య.

కాగా దుర్గయ్య చెన్నూర్‌లో 15 ఏళ్ల పాటు.. 108 వాహనంలో ఈఎంటీగా పనిచేశాడు. ఉన్నత చదువులు చదివి దుబాయ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో మెడికల్‌ ఎమర్జెన్సీ అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ కంపెనీ ఆసియా కప్‌లో పాల్గొనే క్రికెట్‌ జట్లకు వైద్య సహాయం అందించే కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులను ఆయా జట్ల ప్రాక్టీసు సెషన్‌కు పంపించింది. ఆ బృందంలో దుర్గయ్య కూడా ఉన్నాడు.


పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో

ఇక ఆదివారం ఇండియా - పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఉదయం రెండు జట్ల క్రికెటర్లు ప్రాక్టీసు చేశారు. వీరికి దుర్గయ్య వైద్య సహాయకుడిగా సేవలు అందించాడు. ఈ సందర్భంగా ఇండియా, పాకిస్తాన్‌ క్రికెటర్లతో పాటు అఫ్గనిస్తాన్‌ క్రికెటర్లతో కూడా కోచ్‌తో కొంతసేపు గడిపాడు.

ఈ నేపథ్యంలో విధుల్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్‌ దిగ్గజాలకు వైద్య సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని దుర్గయ్య ఫోన్‌ ద్వారా సాక్షికి తెలిపారు. ఇక దుబాయ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా... పాకిస్తాన్‌ మీద ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

చదవండి: Asia Cup 2022: జడ్డూ నీకు నాతో మాట్లాడటం ఇష్టమేనా? మంజ్రేకర్‌ ప్రశ్నకు ఆల్‌రౌండర్‌ ఆన్సర్‌ ఇదే!
Rohit Sharma: తీవ్ర ఉత్కంఠ.. ఓవర్‌కు 10 పరుగులు కావాలి.. అయినా అతడు భయపడలేదు

మరిన్ని వార్తలు