Asia Cup 2022: కోహ్లిని అధిగమించిన రిజ్వాన్‌

12 Sep, 2022 15:09 IST|Sakshi

పాకిస్తాన్‌తో ఆదివారం (సెప్టెంబర్‌ 11) జరిగిన ఆసియా కప్‌-2022 తుది సమరంలో శ్రీలంక 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక జట్టు.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో భంగపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని భారత్‌, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

ఫైనల్లో శ్రీలంక.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి పాక్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లో షాకిచ్చింది. అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో లంకకు డిఫెండింగ్‌ టోటల్‌ అందించిన భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకోగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా బౌలింగ్‌ చేసిన వనిందు హసరంగకు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. 

ఇక ఈ టోర్నీ మొత్తంలో 'టాప్‌' లేపిన ఆటగాళ్ల విషయానికొస్తే.. పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (281 పరుగులు).. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని (276) అధిగమించి టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రిజ్వాన్ 6 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 92 సగటున పరుగులు సాధించాడు. వీరి తర్వాత టాప్‌-5లో ఆఫ్ఘాన్‌ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (196), శ్రీలంక హిట్టర్‌ భానుక రాజపక్స (191), పతుమ్ నిస్సంక (173) ఉన్నారు.  

బౌలర్ల విషయానికొస్తే.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్ కుమార్‌కు దక్కింది. భువీ 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి ప్లేస్‌లో లంక స్పిన్నర్ హసరంగ (9 వికెట్లు), పాక్‌ బౌలర్లు హరీస్‌ రౌఫ్‌, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు తలో 8 వికెట్లు సాధించారు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు కూడా భువీ పేరిటే నమోదై ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్‌ కూడా ఉంది. ఇక, టోర్నీలో నమోదైన ఏకైక సెంచరీ విరాట్‌ సాధించినదే కావడం విశేషం. 
 

మరిన్ని వార్తలు