Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్‌ కాంగ్‌ను పాక్‌ లైట్‌ తీసుకుంటే అంతే సంగతులు!

2 Sep, 2022 12:48 IST|Sakshi

Asia Cup 2022 Pakistan vs Hong Kong- Head To Head Records: ఆసియా కప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌ తమ రెండో మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌తో తలపడనుంది. షార్జా క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం(సెప్టెంబరు 2)న గ్రూప్‌-ఏలోని ఈ రెండు జట్లు సూపర్‌-4లో ఎంట్రీ కోసం పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పసికూన హాంగ్‌ కాంగ్‌పై పాకిస్తాన్‌ విజయం నల్లేరు మీదే నడకేనని గత రికార్డులు చెబుతున్నాయి. అయితే, అప్పటికీ.. ఇప్పటికీ హాంగ్‌ కాంగ్‌ జట్టు ఆట తీరు మెరుగుపడింది.

అంతేకాదు తాజా టోర్నీలో పటిష్టమైన టీమిండియాతో మ్యాచ్‌లోనూ హాంగ్‌ కాంగ్‌ ఆఖరి వరకు పోరాట పటిమ కనబరిచిన తీరు గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్‌ చేతిలో ఆరంభ మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌ కీలకం. భారత్‌తో పాటు సూపర్‌-4కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. పసికూనే కదా అని బాబర్‌ ఆజం హాంగ్‌ కాంగ్‌ను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. అందుకు గల ప్రధాన కారణాలేమిటో గమనిద్దాం.

కీలక బౌలర్‌కు గాయం
పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది ఇప్పటికే గాయం కారణంగా ఆసియా కప్‌-2022 టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. గాయపడిన మహ్మద్‌ వసీం సైతం జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్లు నసీం షా, హారిస్‌ రవూఫ్‌, షానవాజ్‌ దహానీలతో బరిలోకి దిగింది.

అయితే, భారత్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తున్న సందర్భంగా 19 ఏళ్ల నసీం షా గాయపడిన విషయం తెలిసిందే. కాలి నొప్పితో విలవిల్లాడిన ఈ యువ బౌలర్‌ మైదానంలోనే కుప్పకూలాడు. అతడు ఫిట్‌నెస్‌ సాధించినా ఈ మ్యాచ్‌లో ఆడించకపోవచ్చు. నసీం స్థానంలో మహ్మద్‌ హస్నైన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో కీలక వికెట్లు తీసిన నసీం షా సేవలు కోల్పోతే మాత్రం పాక్‌కు నిజంగా ఎదురుదెబ్బే.

కుప్పకూలిన మిడిలార్డర్‌
పాకిస్తాన్‌ జట్టుకు ప్రధాన బలం ఓపెనర్లు. మహ్మద్‌ రిజ్వాన్‌, కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో రిజ్వాన్‌(42 బంతుల్లో 43 పరుగులు) పోరాడినా.. బాబర్‌ ఆజం 10 పరుగులకే పరిమితం కావడంతో పాక్‌ కష్టాల్లో పడింది.

దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన మిడిలార్డర్‌ కుప్పకూలడంతో 147 పరుగులకే పాక్‌ ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగితే పాకిస్తాన్‌ భారీ షాక్‌ తప్పదు. ముఖ్యంగా ఓపెనర్లను కట్టడి చేయగలిగితే హాంగ్‌ కాంగ్‌కు మంచి ఆరంభం లభిస్తుంది. 

ఒత్తిడి సహజమే
ఈ మ్యాచ్‌లో ఓడిపోతే అసోసియేట్‌ దేశం హాంగ్‌ కాంగ్‌ పెద్దగా కోల్పోయేది ఏమీ లేదు. క్వాలిఫైయర్స్‌లో యూఏఈని ఓడించి టోర్నీకి అర్హత సాధించి.. గ్రూప్‌-ఏలో టీమిండియా, పాకిస్తాన్‌ వంటి మేటి జట్లతో ఆడటమే ఓ మంచి అవకాశం. అలాంటిది మొదటి మ్యాచ్‌లో భారత్‌కు పోటీనివ్వగలిగింది. ఈ మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌ ప్రదర్శనను తేలికగా తీసిపారేయలేం.

ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు.. ఆరంభ మ్యాచ్‌లోనే దాయాది భారత్‌ చేతిలో ఓడిన పాక్‌కు హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో నిలిచే పరిస్థితి. గాయాల బెడద వెంటాడుతున్న తరుణంలో బాబర్‌ ఆజం బృందంపై కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. 

గత రికార్డులు ఘనమే.. కానీ..
ఆసియా కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌, హాంగ్‌ కాంగ్‌ ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో తలపడ్డాయి. 2004, 2008, 2018లో వన్డే ఫార్మాట్లో హాంగ్‌ కాంగ్‌పై పాక్‌ జట్టు ఘన విజయాలు సాధించింది. 2004లో డీఎల్‌ఎస్‌ మెథడ్‌లో 173 పరుగులు, 2008లో 155 పరుగులు, 2018లో 8 వికెట్ల తేడాతో పసికూనపై అలవోకగా గెలుపొందింది.

అయితే, ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇక పొట్టి ఫార్మాట్‌ అంటేనే సంచలనాలకు మారుపేరు. మ్యాచ్‌ ఎప్పుడు ఏ జట్టు చేజారుతుందో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్‌.. ఈ మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌ను తేలికగా తీసుకుంటే అంతే సంగతులు!

చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్‌! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్‌ అల్‌ హసన్‌
Asia Cup 2022: 'రోహిత్‌ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు'

మరిన్ని వార్తలు