AFG Vs PAK super-4: పాక్‌తో మ్యాచ్‌.. ఆఫ్గన్‌ గెలిస్తేనే టీమిండియాకు అవకాశం

7 Sep, 2022 19:07 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌-4లో బుధవారం పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ మద్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక అఫ్గానిస్తాన్‌ గెలుపుపైనే టీమిండియాకు ఆసియా కప్‌లో అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఆఫ్గన్‌ ఓడిందో ఇక టీమిండియా ఇంటిబాట పట్టాల్సిందే. శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో ఓడిన అఫ్గానిస్తాన్‌కు పాక్‌తో మ్యాచ్‌ కీలకమని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో నజీబుల్లా జర్దన్‌, రహమతుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జర్దన్‌, హజరతుల్లా జజాయ్‌లు, కెప్టెన్‌ మహ్మద్‌ నబీ పెద్ద బలం కాగా.. వీరు విఫలమైతే మాత్రం అఫ్గన్‌లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు. ఇక బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌, ముజీబుర్‌ రెహమాన్‌లు సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.

ఇక టీమిండియాపై విజయంతో జోష్‌లో ఉన్న పాకిస్తాన్‌.. ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతుంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం విఫలమైనప్పటికి.. మరో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సహా ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ నవాజ్‌, ఆసిఫ్‌ అలీ, కుష్‌దిల్‌ షా, ఇఫ్తికర్‌ అహ్మద్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తుండడం సానుకూలాంశం. ఇక బౌలింగ్‌లో నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌, హారిస్‌ రౌఫ్‌ అంచనాలకు మంచి రాణిస్తున్నారు. 

ఇక రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు టి20ల్లో రెండుసార్లు తపలడగా.. రెండుసార్లు పాక్‌నే విజయం వరించింది. 2013లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత గతేడాది టి20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడగా పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఇక వన్డేల్లో నాలుగుసార్లు తలపడగా.. అన్నింటిలోనూ పాకిస్తాన్‌నే విజయం వరించింది.
 

మరిన్ని వార్తలు