Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు.. వీడియో

27 Aug, 2022 13:56 IST|Sakshi
రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు(PC: Rashid Khan Twitter)

Asia Cup 2022 Sri Lanka vs Afghanistan: శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ షేర్‌ చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు.. ‘‘నువ్వు ఈరోజు మ్యాచ్‌లో బంతితో పాటు.. బ్యాట్‌తోనూ మ్యాజిక్‌ చేయగలవని నమ్ముతున్నాం బాస్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్‌ వేదికగా శ్రీలంక- అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌తో ఆసియా కప్‌-2022 టోర్నీ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది.

ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక టోర్నీ మొదటి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తాను నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసిన వీడియోను రషీద్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ఇందులో రషీద్‌ స్నేక్‌ షాట్‌ ఆడినట్లు కనిపిస్తోంది.

ఇక ఈ వీడియోకు.. ‘‘గేమ్‌ డే.. అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది’’ అంటూ అతడు క్యాప్షన్‌ ఇచ్చాడు. కాగా మహ్మద్‌ నబీ సారథ్యంలో అఫ్గన్‌ జట్టు లంకతో తలపడనుంది. ఆసియా కప్‌ ఈవెంట్‌కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన అఫ్గనిస్తాన్‌కు ఆతిథ్య జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌.. అఫ్గన్‌ను 3-2తో ఓడించి ట్రోఫీని గెలిచింది. 

ఇక స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌కు టీ20లలో అద్భుతమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అతడు కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్‌.. జట్టును టైటిల్‌ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆడిన షాట్‌ను అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఇది ధోని హెలికాప్టర్‌ షాట్‌ను పోలి ఉన్నా బ్యాటర్‌ తల చుట్టూ కాకుండా బ్యాట్‌ యథాస్థానంలోకి వచ్చి చేరింది. దీనికి స్నేక్‌షాట్‌గా రషీద్‌ నామకరణం చేశాడు.

చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌ ఎలా పుట్టిందో తెలుసా?.. ఆసక్తికర విషయాలు
Asia Cup 2022: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌, ఇతర వివరాలు

మరిన్ని వార్తలు