Asia Cup 2022: భారత్‌ కథ ముగిసె!

7 Sep, 2022 05:34 IST|Sakshi

టీమిండియాకు రెండో ఓటమి

తుదిపోరుకు చేరువైన శ్రీలంక

రోహిత్‌ మెరుపులు వృథా

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత్‌కు ఊహించని షాక్‌! అభిమానుల గుండె పగిలె ఫలితం శ్రీలంక చేతిలోనూ ఎదురైంది. సూపర్‌ –4లో వరుసగా రెండో ఓటమి. దీంతో ఫైనల్‌ ఆశలకు దాదాపు తెరపడింది. నేడు పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్‌ అద్భుతం చేస్తే తప్ప మనకు దారే లేదు. మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్లతో భారత్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మొదట టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. మదుషంక 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. నిసాంక (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన షనకకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.   

కెప్టెన్‌ ఒక్కడే!
గత మ్యాచ్‌కు భిన్నంగా ఆట మొదలైంది. పాక్‌పై ధాటిగా ఆరంభమైన ఓపెనింగ్‌ మెరుపులు... శ్రీలంకపై కరువయ్యాయి. ఓపెనర్‌ రాహుల్‌ (6) రెండో ఓవర్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరుసటి ఓవర్లోనే కోహ్లి (0) డకౌటయ్యాడు. 13 పరుగులకే రెండు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్‌ రోహిత్‌ బాధ్యతగా నడిపించాడు. అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టి రన్‌రేట్‌ పెంచాడు.

మళ్లీ తనే వేసిన పదో ఓవర్లో మరో సిక్సర్, బౌండరీతో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్‌ స్కోరు 79/2. సగం ఓవర్లు అయిపోవడంతో ‘హిట్‌మ్యాన్‌’ ధాటిని మరింత పెంచాడు. కానీ ఆ క్రమంలోనే వెనుదిరిగాడు. హసరంగ వేసిన 12వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. మరుసటి ఓవర్లో కరుణరత్నే స్లో డెలివరీతో రోహిత్‌ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి  సూర్యకుమార్‌ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్‌)ను స్లో బౌన్సర్‌తో షనక పెవిలియన్‌ చేర్చాడు. పాండ్యా (17), పంత్‌ (17) పెద్దగా మెరిపించలేదు. అశ్విన్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 1 సిక్స్‌) చేసిన ఆ కాస్త పరుగులతోనే కష్టంగా 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చెలరేగిన ఓపెనర్లు
లంక ఛేదన తొలి ఓవర్లో కేవలం పరుగుతో మొదలైంది. తర్వాత ఓవర్‌ నుంచి ఫోర్లతో, అటు నుంచి సిక్సర్లతో చకచకా సాగిపోయింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌ల జోరుతో అర్‌‡్షదీప్‌ తేలిపోయాడు. ఐదో ఓవర్లో అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రీలంక 5.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. మరో ఐదు ఓవర్లు... మొత్తంగా సగం ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు వికెట్‌ తీయలేకపోయారు. అవతలివైపు ఓపెనర్లే లక్ష్యంలో సగం స్కోరును (10 ఓవర్లలో 89/0) దాటేశారు. 12వ ఓవర్‌ వేసిన చహల్‌ నిసాంకతో పాటు అసలంక (0)ను పెవిలియన్‌ చేర్చాడు.

స్వల్ప వ్యవధిలో గుణతిలక (1)ను అశ్విన్, కుశాల్‌ మెండిస్‌ను చహల్‌ అవుట్‌ చేయడంతో 110 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరం ఆనందంలో తేలియాడింది. కానీ రాజపక్స వచ్చీ రాగానే స్పిన్నర్లిదరి ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. తర్వాత కెప్టెన్‌ షనక కూడా జాగ్రత్తగా ఆడటంతో లక్ష్యానికి చేరువైంది. ఆఖరి అవకాశాన్ని కూడా కీపర్‌ పంత్, బౌలర్‌ అర్‌‡్షదీప్‌ చేజార్చడంతో లంక మరో బంతి ఉండగానే గెలిచింది. 2 బంతుల్లో 2 పరుగుల సమీకరణం వద్ద ఐదో బంతిని షనక బీట్‌ అయ్యాడు. పంత్‌ వికెట్లపై విసరగా తగలకుండా బంతి బౌలర్‌ అర్‌‡్షదీప్‌ చేతుల్లో పడింది. తను పరుగెత్తుకుంటూ వికెట్లను కొట్టకుండా బలంగా విసరడంతో అవుట్‌ కావాల్సిన చోట ఓవర్‌త్రోతో 2 పరుగులు వచ్చాయి.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 6; రోహిత్‌ (సి) నిసాంక (బి) కరుణరత్నే 72; కోహ్లి (బి) మదుషంక 0; సూర్యకుమార్‌ (సి) తీక్షణ (బి) షనక 34; పాండ్యా (సి) నిసాంక (బి) షనక 17; పంత్‌ (సి) నిసాంక (బి) మదుషంక 17; దీపక్‌ హుడా (బి) మదుషంక 3; అశ్వి న్‌ (నాటౌట్‌) 15; భువనేశ్వర్‌  (బి) కరుణరత్నే 0; అర్‌‡్షదీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–11, 2–13, 3–110, 4–119, 5–149, 6–157, 7–158, 8–164. బౌలింగ్‌: మదుషంక 4–0–24–3, మహీశ్‌ తీక్షణ 4–0–29–1, చమిక 4–0–27–2, అసిత ఫెర్నాండో 2–0–28–0, హసరంగ 4–0–39–0, షనక 2–0–26–2.  

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) రోహిత్‌ (బి) చహల్‌ 52; కుశాల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్‌ 57; అసలంక (సి) సూర్యకుమార్‌ (బి) చహల్‌ 0; గుణతిలక (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 1; రాజపక్స (నాటౌట్‌) 25; షనక (నాటౌట్‌) 33; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–97, 2–97, 3–110, 4–110. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–30–0, అర్‌‡్షదీప్‌ 3.5–0–40–0, పాండ్యా 4–0–35–0, చహల్‌ 4–0–34–3, అశ్విన్‌ 4–0–32–1.

భారత్‌ ఫైనల్‌ చేరాలంటే...
నేడు జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్‌ తప్పనిసరిగా గెలవాలి. అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్‌ కూడా విజయం సాధించాలి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా శ్రీలంక తప్పనిసరిగా నెగ్గాలి. ఇలా జరిగితే శ్రీలంక ఫైనల్‌ చేరుతుంది. భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ జట్లు రెండు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ మూడు జట్లలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఒకవేళ నేడు అఫ్గానిస్తాన్‌పై గెలిస్తే పాకిస్తాన్‌ ఫైనల్లోకి అడుగు పెడుతుంది. పాక్‌ , భారత్‌లపై అఫ్గానిస్తాన్‌ గెలిచి... లంకపై పాకిస్తాన్‌ నెగ్గితే... పాక్, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న రెండు జట్లు ఫైనల్‌ చేరుతాయి.   

మరిన్ని వార్తలు