Asia Cup 2022: ఇండియా-పాక్‌ మ్యాచ్‌ చూస్తే రూ. 5000 జరిమానా..!

28 Aug, 2022 12:51 IST|Sakshi

ఆసియా కప్‌ 2022లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్‌ 28) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ఇరు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరగకపోవడంతో ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడగా.. అక్కడ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ఇదిలా ఉంటే, దాయాదుల సమరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) యాజమాన్యం జారీ చేసినట్లు చెబుతున్న కొన్ని వివాదాస్పద అంక్షలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పలు మాధ్యమాల ద్వారా అందిన వివరాల మేరకు.. ఎన్‌ఐటీ విద్యార్ధులు ఇవాళ జరిగే భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

విద్యార్ధులు హాస్టల్‌ గదుల్లో గుంపులుగా చేరి మ్యాచ్‌ను చూసినా, మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా.. సంబంధిత విద్యార్ధులను హాస్టల్‌ గది ఖాళీ చేయించడంతో పాటు రూ. 5000 జరిమానా విధిస్తామని కళాశాల డీన్‌ హెచ్చరించినట్లు సమాచారం. మ్యాచ్‌ సమయంలో విద్యార్ధులంతా తమతమ గదుల్లోనే ఉండాలని, అలా కాకుండా యాజమాన్యం హెచ్చరికలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసుల జారీ చేసినట్లు తెలుస్తోంది. 2016లో ఓ మ్యాచ్‌ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ అంక్షలు జారీ చేసినట్లు ఎన్‌ఐటీ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
చదవండి: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. దినేష్‌ కార్తీక్‌కు నో ఛాన్స్‌!

Poll
Loading...
మరిన్ని వార్తలు