Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్‌ నేలపాలు.. అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్‌! వైరల్‌

5 Sep, 2022 08:36 IST|Sakshi
అర్ష్‌దీప్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం (Twitter pic)

Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Arshdeep Singh Drops A Sitter: ఆసియా కప్‌-2022 టోర్నీ సూపర్‌-4లో మొదటి మ్యాచ్‌లోనే టీమిండియాకు పరాభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. భారత బ్యాటర్లు ఆకట్టుకున్నా.. బౌలర్లు విఫలం కావడంతో హోరాహోరీ మ్యాచ్‌లో దాయాదిదే పైచేయి అయింది. ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ జారవిడిచిన క్యాచ్‌ వల్ల రోహిత్‌ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

అర్ష్‌దీప్‌ తప్పిదంతో బతికిపోయిన పాక్‌ ఆటగాడు అసిఫ్‌ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదాడు. ఇక ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లోనూ మరోసారి బంతిని బౌండరీకి తరలించాడు. చివరి ఓవర్‌ నాలుగో బంతికి అసిఫ్‌ అలీని అర్ష్‌దీప్‌ అవుట్‌ చేసినా అప్పటికే మ్యాచ్‌ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి రెండు బంతుల్లో పాక్‌ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఇఫ్తికర్‌ అహ్మద్‌ లాంఛనం పూర్తి చేసి తమ జట్టును గెలిపించాడు.

అర్ష్‌దీప్‌పై అరిచిన రోహిత్‌
కీలకమైన సమయంలో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ నేలపాలు చేయడంతో ఉత్కంఠగా మ్యాచ్‌ వీక్షిస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక మైదానంలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే దాయాదితో ప్రతిష్టాత్మక పోరు.. అందునా పట్టు బిగించే తరుణంలో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ అందుకోలేకపోవడంతో హిట్‌మ్యాన్‌ సహనం కోల్పోయాడు.

‘ఏంటిది.. ఏం చేశావో అర్థమైందా నీకసలు’ అన్నట్లుగా అరుస్తూ అర్ష్‌దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా భారత్‌కు ఓటమి ఎదురైన నేపథ్యంలో ఫ్యాన్స్‌ సైతం బౌలర్ల తీరుపై గుర్రుగా ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇక టీమిండియా బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 60 పరుగులు సాధించాడు కోహ్లి.
చదవండి: Asia Cup 2022: 'కింగ్‌ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే'
Asia Cup 2022: పాక్‌పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత!

Poll
Loading...
మరిన్ని వార్తలు