Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్‌ ఆందోళన!

26 Aug, 2022 10:18 IST|Sakshi
ధోని- కోహ్లి(Photo Credit: Virat Kohli Twitter)

Asia Cup 2022- Virat Kohli On MS Dhoni- Viral: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పట్ల అభిమానం చాటుకోవడంలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎల్లప్పుడూ ముందుంటాడు. సందర్భాన్ని బట్టి తలాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు ఈ మాజీ సారథి. కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో విమర్శల పాలవుతున్న కోహ్లి.. ఆసియా కప్‌-2022 టోర్నీతో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

ఈ గొప్ప వ్యక్తికి డిప్యూటీగా ఉన్నందుకు!
ఈ మెగా ఈవెంట్‌ సన్నాహకాల్లో భాగంగా ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం కోహ్లి.. ధోనిని ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. ధోని కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న నాటి ఫొటోను షేర్‌ చేసిన ఈ ‘సెంచరీల వీరుడు’.. ‘‘నా కెరీర్‌ మొత్తంలో నేను ఆస్వాదించిన అత్యంత అద్భుతమైన క్షణాలు ఏవైనా ఉన్నాయంటే.. ఈయనకు నమ్మదగిన డిప్యూటీగా ఉండటమే! 

మేము కలిసి ఆడిన సమయం.. నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎల్లప్పుడూ నా మదిలో నిలిచిపోతాయి. 7+18’’ అంటూ హార్ట్‌ ఎమోజీ జత చేశాడు. కాగా ధోని జెర్సీ నంబర్‌ 7 కాగా.. కోహ్లి 18 నంబరు గల జెర్సీ ధరిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కలిసి వచ్చేలా 25వ తేదీన కోహ్లి ఈ మేరకు తమ అనుబంధం గురించి ట్వీట్‌ చేశాడు. ఇక ఈ ఫొటో టీ20 ప్రపంచకప్‌-2016 నాటికి సంబంధించినది. నాడు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లి 51 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ​

ఎందుకు ఈ ట్వీట్‌?
కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఆగష్టు 18 నాటికి 14 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసిన ఈ పరుగుల యంత్రం.. శతకం బాది వెయ్యి రోజులు దాటిపోయింది. ఈ క్రమంలో ఆసియా కప్‌లోనైనా బ్యాట్‌ ఝులిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ఫొటోలు తనను తాను మోటివేట్‌ చేసుకునేందుకు ఉపయోగపడతాయని అంటున్నారు.  

అయితే, ఈ ఫొటోపై హేటర్స్‌ ఎప్పటిలాగానే.. అవసరం ఉన్నపుడు మనుషులను వాడటం నీకే సాధ్యం అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మంది అభిమానులు మాత్రం.. కోహ్లి టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లి ఐపీఎల్‌-2022లోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు.

నువ్వులేని జట్టు మాకొద్దు!
ఇక ఆసియా కప్‌ టోర్నీలో గనుక విఫలమైతే అతడిని టీ20 ప్రపంచకప్‌-2022 జట్టు ఎంపిక సమయంలో పక్కనపెట్టేందుకు సెలక్టర్లు వెనుకాడబోరంటూ కోహ్లి వ్యతిరేకులు కామెంట్లు చేస్తున్న వేళ.. తనకు తానే తప్పుకొనేందుకు సిద్ధమవుతున్నాడా అంటూ అని అభిప్రాయపడుతున్నారు. నువ్వు లేని జట్టును ఊహించుకోలేము అంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. 

ఇదిలా ఉంటే.. క్రీడా ప్రపంచంలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న కోహ్లి లేకుండా టీమిండియా మెగా ఈవెంట్‌లో పోటీకి దిగడం ఇప్పట్లో జరగని పని అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ధోని సారథ్యంలో మేటి క్రికెటర్‌గా ఎదిగిన కోహ్లి.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మిస్టర్‌ కూల్‌ అతడి నేతృత్వంలో ఆడిన విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup 2022: భారత్‌- పాకిస్తాన్‌ ఏ జట్టు ఆటగాడైనా ఒకటే! మేము అన్నదమ్ముల్లా ఉంటాం!

మరిన్ని వార్తలు