Virat Kohli: ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించడమే లక్ష్యంగా ముందుకు.. కానీ: కోహ్లి

27 Aug, 2022 12:12 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: BCCI)

Asia Cup 2022- India Vs Pakistan- Virat Kohliఆసియా కప్‌-2022 టోర్నీలో ఆడే తొలి మ్యాచ్‌తో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వందో టీ20 ఆడిన క్రికెటర్‌గా ఫీట్‌ నమోదు చేయనున్నాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఈ ఈవెంట్‌లో మొదటి మ్యాచ్‌ నేపథ్యంలో.. కోహ్లికి ఇది మరింత ప్రత్యేకంగా మారింది.

గత కొంతకాలంగా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శల పాలవుతున్న కోహ్లి.. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. నెట్స్‌లో షాట్లతో విరుచుకుపడుతూ మునుపటి కోహ్లిని గుర్తు చేస్తున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వస్తాననే సంకేతాలు ఇస్తున్నాడు.

ఇక వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటన నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న ఈ మెగా ఈవెంట్‌లో దాయాదితో పోరుతో పునరాగమనం చేయనున్న వేళ కోహ్లి బీసీసీఐ టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. తాను ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడం కోసం శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నాడు.

వందకు వంద శాతం మనసు పెడతా!
ఈ మేరకు కోహ్లి మాట్లాడుతూ.. ‘‘నిద్రలేవగానే ఈరోజు మనం ఏం చేయబోతున్నాము.. రోజు ఎలా ఉండబోతోంది.. అన్న విషయాల గురించి పెద్దగా ఆలోచించను. అయితే, చేయాల్సిన.. చేస్తున్న ప్రతి పనిని వందకు వంద శాతం మనసు పెట్టి చేస్తాను. 

మైదానంలో నువ్వు అంత దూకుడుగా ఎలా ఉంటావని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. నాకు ఆట అంటే ప్రేమ. ప్రతి బాల్‌ను ఎదుర్కోవాలనుకుంటాను. జట్టును గెలిపించేందుకు నా సర్వశక్తులు ఒడ్డుతాను. 

నాకైతే ఇలా ఉండటం అసాధారణంగా ఏమీ అనిపించదు. ఎలాగైనా సరే జట్టును గెలిపించడమే నా లక్ష్యం. అందుకోసం ఎంతటి శ్రమకైనా ఓరుస్తాను. కానీ ఒక్కోసారి మైదానాన్ని భిన్నంగా కనిపించానంటే.. ఆరోజు నేను మ్యాచ్‌ కోసం ఎంతగా సన్నద్ధమయ్యానో నాకే తెలుసు. అయితే, అది కొంతమందికి సహజంగా అనిపించకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

కాగా టీ20 ప్రపంచకప్‌ కప్‌-2021 తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన కోహ్లిని.. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో పరాభవం నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు పగ్గాలు సైతం వదిలేశాడు. ఇక కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌, ఇతర వివరాలు
IND vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు రోహిత్‌ డుమ్మా; కేఎల్‌ రాహుల్‌ ఏమన్నాడంటే..

మరిన్ని వార్తలు