Asia Cup 2022: పాక్‌తో ఫైనల్లో మాకు ఆ జట్టు స్ఫూర్తి.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు మేము: దసున్‌ షనక

12 Sep, 2022 14:13 IST|Sakshi

ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పరాభవం.. అఫ్గనిస్తాన్‌ చేతిలో ఘోర ఓటమి.. కానీ ఆ తర్వాత శ్రీలంక జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. బంగ్లాదేశ్‌పై తొలి గెలుపు నమోదు చేసిన దసున్‌ షనక బృందం విజయాల బాట పట్టి టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచింది. సూపర్‌-4లో వరుసగా అఫ్గనిస్తాన్‌, ఇండియా, పాకిస్తాన్‌లను ఓడించి ఫైనల్‌ చేరి.. తుదిపోరులో మరోసారి పాక్‌ను మట్టికరిపించి ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ విజేతగా అవతరించింది.

దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం దృష్ట్యా.. సొంత ప్రేక్షకుల కేరింతల నడుమ అందుకోవాల్సిన ట్రోఫీని దుబాయ్‌ గడ్డపై ముద్దాడింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజలకు.. ఈ మెగా టోర్నీలో విజయంతో ఉపశమనం కలిగించి.. వాళ్ల ముఖాలు విజయదరహాసంతో వెలిగిపోయేలా చేసింది యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు.

అసాధారణ.. అద్వితీయ గెలుపు
కోటి రూపాయలకు పైగా ప్రైజ్‌మనీ సాధించి దేశానికి శుభవార్త అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ గెలుపు నిజంగా అసాధారణమైనది. వారు పంచిన ఆనంతం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా దుబాయ్‌ పిచ్‌ మీద టాస్‌ గెలిస్తేనే విజయం అన్న అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ జయకేతనం ఎగురవేసి.. గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది.

మాకు సీఎస్‌కే ఆదర్శం!
ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ మ్యాచ్‌లో.. ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌ 2021 చెన్నై ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్‌ చేసి.. గెలిచింది.

మేము మ్యాచ్‌ ఆడుతున్నపుడు నా మదిలో ఇదే విషయం మెదిలింది. మా జట్టులోని యువ ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వనిందు నిజంగా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రభావం చూపాడు.

చమిక, ధనుంజయ డి సిల్వా కూడా బాగా బ్యాటింగ్‌ చేశారు. చివరి బాల్‌ను సిక్స్‌గా మలచడం మాకు టర్నింగ్‌ పాయింట్‌. 160 పరుగుల స్కోరు అనేది ఛేదించదగ్గ లక్ష్యంగానే కనిపిస్తుంది. అయితే, 170 మార్కు మానసికంగా ప్రత్యర్థిపై కాస్త ఒత్తిడి పెట్టేందుకు ఉపకరిస్తుంది.

ఇక మధుషంక గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా తనకు నేను ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు మద్దతుగా నిలిచాను’’ అని షనక చెప్పుకొచ్చాడు. కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌-2021 రెండో దశ మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. 

అప్పుడు చెన్నై.. ఇప్పుడు శ్రీలంక
ఈ క్రమంలో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లలో దాదాపు అన్నింటిలోనూ సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. అయితే, ఫైనల్లో ధోని సేన టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసినప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 27 పరుగుల తేడాతో మోర్గాన్‌ బృందాన్ని మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై అదే తరహాలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. పాక్‌ను 23 పరుగులతో ఓడించి ఆసియా కప్‌-2022 చాంపియన్‌గా అవతరించింది.

చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్‌ ఆజం
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ..

మరిన్ని వార్తలు