#Asia Cup: పాకిస్తాన్‌కు షాక్‌! పంతం నెగ్గింది..! ఇక ఆసియా కప్‌..

9 May, 2023 13:52 IST|Sakshi
లంక కెప్టెన్‌ దసున్‌ షనక- టీమిండియా సారథి రోహిత్‌ శర్మ

Asia Cup 2023: ఆసియా కప్‌-2023 వేదిక మారనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్‌ నుంచి వేరే దేశానికి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్‌ మండలి కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆసియా టీ20 టోర్నీ-2022 ఫైనలిస్టు పాకిస్తాన్‌ ఈసారి ఈ మెగా ఈవెంట్‌ నిర్వహించేందుకు హక్కులు సంపాదించిన విషయం తెలిసిందే.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపలేమని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. కానీ.. బీసీసీసీఐ ఈ హైబ్రీడ్‌ మోడల్‌ను కూడా తిరస్కరించినట్లు కథనాలు వచ్చాయి.

ఈసారి ఆసియా కప్‌ అక్కడే
ఈ క్రమంలో ఆసియా కప్‌-2023 నిర్వహణ వేదికను పాకిస్తాన్‌ నుంచి శ్రీలంకకు తరలించినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వచ్చే నెల(జూన్‌)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాలు వెల్లడించినట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. 

కాగా ఆసియా కప్‌ 2022 టీ20 టోర్నీలో శ్రీలంక- పాకిస్తాన్‌ ఫైనల్‌కు చేరగా.. పాక్‌ను ఓడించి లంక ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈవెంట్‌కు సంబంధించి పాక్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. అయితే, ఆటగాళ్ల భద్రతా అంశంపై బీసీసీఐ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. పీసీబీ హైబ్రీడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది.

గట్టిగా ఫిక్స్‌ అయ్యారు
టీమిండియా తప్ప మిగతా దేశాల మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో నిర్వహిస్తామని తెలిపింది. అయితే, ఆసియా క్రికెట్‌ మండలి అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ ప్రపోజల్‌ను కూడా తిరస్కరించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్‌ నుంచి వేదికను తరలించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరులో ఈ టోర్నీ ఆరంభానికి షెడ్యూల్‌ ఖరారు కాగా కానుండగా.. వేదికపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  

చదవండి: ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! జోర్డాన్‌ ఎం‍ట్రీ

మరిన్ని వార్తలు