లంకకు నమీబియా షాక్‌

17 Oct, 2022 03:54 IST|Sakshi

55 పరుగులతో ఆసియా చాంపియన్‌పై అద్భుత విజయ

ఫ్రయ్‌లింక్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

టి20 ప్రపంచకప్‌  

గిలాంగ్‌: ఆసియా టి20 చాంపియన్‌ శ్రీలంకకు క్రికెట్‌ కూన నమీబియా పెద్ద షాకే ఇచ్చింది. టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘ఎ’ తొలి రౌండ్‌ (క్వాలిఫయర్స్‌) మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో 2014 టి20 ప్రపంచకప్‌ విజేత లంకను చిత్తు చేసింది. గతేడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న నమీబియా ఇక్కడ తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేసింది. మొదట నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాన్‌ ఫ్రయ్‌లింక్‌ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

ఒకదశలో 14.2 ఓవర్లలో 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నమీబియాను  ఫ్రయ్‌లింక్, స్మిట్‌ ధాటిగా ఆడి ఆదుకున్నారు. ఇద్దరు చివరి 5.4 ఓవర్లలోనే ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మదుషాన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ దాసున్‌ షనక (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రాజపక్స (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) తప్ప ఇంకెవరూ ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయారు. ఫ్రయ్‌లింక్‌ (2/26), స్మిట్‌ (1/16) బంతితోనూ ఆకట్టుకున్నారు. వీస్, బెర్నార్డ్, షికొంగో తలా 2 వికెట్లు తీశారు.  

నెదర్లాండ్స్‌ బోణీ
ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నెదర్లాండ్స్‌ ఆఖరిదాకా చెమటోడ్చి నెగ్గింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్‌ ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేపినా... నెదర్లాండ్స్‌ 3 వికెట్ల తేడాతో గట్టెక్కింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. ఓపెనర్‌ వసీమ్‌ (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. బస్‌ డి లీడే (3/19) ఒక్క ఓవర్‌తో మలుపు తిప్పాడు. 91/2 స్కోరుతో ఒకదశలో పటిష్టంగానే కనిపించిన యూఏఈకు అదేస్కోరుపై వసీమ్‌ వికెట్‌ను కోల్పోయాక కష్టాలు మొదలయ్యాయి. 18వ ఓవర్లో ఫరీద్‌ (2) రనౌటయ్యాడు.

ధనాధన్‌ ఆడే డెత్‌ ఓవర్లలో పరుగులకు బదులు వికెట్లు రాలడంతో యూఏఈ ఊహించనిరీతిలో కట్టడి అయ్యింది. 19వ ఓవర్‌ వేసిన డి లీడే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. అరవింద్‌ (18), బాసిల్‌ హమీద్‌ (4), కెప్టెన్‌ రిజ్వాన్‌ (1)లను లీడే అవుట్‌ చేశాడు. ఆఖరి ఓవర్లో అఫ్జల్‌ ఖాన్‌ (5)ను క్లాసెన్‌ పెవిలియన్‌ చేర్చడంతో... కేవలం 19 పరుగుల వ్యవధిలోనే యూఏఈ 6 వికెట్లను కోల్పోయింది.

తర్వాత నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ ఓడోడ్‌ (23; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆఖర్లో కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌ (16 నాటౌట్‌), ప్రింగిల్‌ (5) కుదురుగా ఆడి గెలిపించారు. జునైద్‌ సిద్ధిఖ్‌ 3 వికెట్లు తీశాడు. చివరి 12 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో 19 ఓవర్లో ప్రింగిల్‌ను జహూర్‌ ఖాన్‌ అవుట్‌ చేయగా 4 పరుగులే వచ్చాయి. 6 బంతుల్లో 6 పరుగుల విజయ సమీకరణం యూఏఈని ఊరించినప్పటికీ ఎడ్వర్డ్స్, వాన్‌ బిక్‌ (4) షాట్ల జోలికి వెళ్లకుండా ఒకట్రెండు       పరుగులు తీసి జట్టును గెలిపించారు.  

గ్రూప్‌ ‘బి’లో నేటి మ్యాచ్‌లు
స్కాట్లాండ్‌ vs వెస్టిండీస్‌ (ఉదయం గం. 9:30 నుంచి)
ఐర్లాండ్‌ vs జింబాబ్వే (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)

స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు