ఆసియా కప్‌ జరగడం అనుమానమే.. 'అందుకు' ససేమిరా అంటున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌

11 May, 2023 15:09 IST|Sakshi

ఆసియా కప్‌-2023 నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. అయితే, భద్రత కారణాల దృష్ట్యా పాక్‌లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో, సగం మ్యాచ్‌లు యూఏఈలో (భారత్‌ ఆడే మ్యాచ్‌లు), సగం మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్‌  అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్‌, పాక్‌ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు.

అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్‌ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ తెరపైకి తెచ్చింది.

అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం. టీమిండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని పీసీబీ చీఫ్‌ అన్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్‌, ఆసియా కప్‌ టీ20 టోర్నీలు ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేసినప్పటికీ శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ససేమిర అన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని పీసీబీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఒప్పించేందుకు పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథి స్వయంగా రంగంలో దిగినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో టోర్నీ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, సెప్టెంబర్‌ 2 నుంచి 17 వరకు జరగాల్సి ఉన్న ఆసియా కప్‌-2023 టోర్నీకి సంబంధించి వచ్చే నెల(జూన్‌)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

చదవండి: వన్డే ప్రపంచకప్‌.. భారత్‌ తొలి మ్యాచ్‌ ఎవరితో అంటే? మరి పాక్‌తో
 

మరిన్ని వార్తలు