IND Vs PAK Super-4 Rahul Dravid: భారత్‌-పాక్‌ మ్యాచ్‌; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో

4 Sep, 2022 09:16 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో వారం గ్యాప్‌ వ్యవధిలో చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్తాన్‌లు మరోసారి తలపడనున్నాయి. లీగ్‌ దశలో పాక్‌ను చిత్తు చేయడమే గాక.. హాంగ్‌ కాంగ్‌పై విజయం సాధించిన గ్రూఫ్‌ టాపర్‌గా నిలిచిన టీమిండియా మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తుంది. అయితే హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన పాకిస్తాన్‌ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ముఖ్యంగా పాక్‌ బౌలర్లు హాంగ్‌ కాంగ్‌ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయం.

వాస్తవానికి ఆసియా కప్‌లో బరిలోకి దిగిన టీమిండియా జట్టులో బౌలింగ్‌ విభాగం కాస్త వీక్‌గా కనిపిస్తుంది. బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉండడంతో బౌలింగ్‌ లోపాలు బయటపడడం లేదు. భువనేశ్వర్‌ కుమార్‌ మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆవేశ్‌ ఖాన్‌ దారాళంగా పరుగులు సమర్పించుకుంటుంగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ వికెట్లు తీస్తున్నప్పటికి పరుగులు కూడా బాగానే ఇస్తున్నాడు. ఇక స్పిన్నర్‌ చహల్‌ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. దీనికి తోడు గాయంతో ఆల్‌రౌండర్‌ జడేజా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దీంతో బౌలింగ్‌ విభాగం మరింత వీక్‌ అయింది. అయితే భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్‌ బౌలింగ్‌ విభాగం స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌,  మహ్మద్‌ నవాజ్‌ రూపంలో నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నారు.

ఇదే విషయమై టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. పాక్‌తో పోరుకు ముందు శనివారం సాయంత్రం ద్రవిడ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. పాకిస్తాన్‌ బౌలర్లంతా సెక్సీగా భారత్‌ బౌలర్లు లేరంటూ ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' నాకు ఆ పదం వాడాలని ఉంది.. కానీ బయటికి చెప్పలేను. నా మైండ్‌లోకి ఆ పదం వచ్చినప్పటికి.. అభ్యంతరంగా అనిపిస్తుండడంతో నోటి వద్దే ఆగిపోయింది. అయితే అదొక నాలుగు అక్షరాల పదం.. మొదటి అక్షరం 'S'తో మొదలవుతుంది. పాకిస్తాన్‌ బౌలర్లు.. భారత్‌ బౌలర్ల కంటే పటిష్టంగా కనిపిస్తున్నారు. దీంతో మరోసారి మంచి మ్యాచ్‌ చూడబోతున్నాం'' అని చెప్పుకొచ్చాడు.

అయితే ద్రవిడ్‌ ఆ అక్షరం 'S'తో  మొదలవుతుంది అని చెప్పగానే అక్కడున్న రిపోర్టర్లు వెంటనే.. ద్రవిడ్‌ సార్‌ మీరేం చెప్పాలనుకున్నారో మాకు అర్థమైంది. సెక్సీ అనే పదం ఎలా అనాలో తెలియక మీరు ఇబ్బంది పడ్డారు.. మీ బాధను అర్థం చేసుకున్నాం అంటూ తెలిపారు. దీంతో ద్రవిడ్‌తో పాటు మిగతావాళ్లు కూడా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Asia Cup 2022: భారత్, పాకిస్తాన్‌ మధ్య ‘సూపర్‌–4’ మ్యాచ్‌

IND Vs PAK Super-4: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు