Asia Cup 2022: హవ్వ.. మరీ హాంగ్‌ కాంగ్‌ చేతిలోనా? కంటి మీద కునుకు ఉంటుందా: భారత మాజీ క్రికెటర్‌

1 Sep, 2022 15:58 IST|Sakshi
టీమిండియా ఆటగాళ్లతో అర్ష్‌దీప్‌ సింగ్‌ (PC: BCCI Twitter)

Asia Cup 2022- India Vs Hong Kong- Avesh Khan- Arshdeep Singh: ఆసియా కప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్లు ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్‌ రితీందర్‌ సోధి పెదవి విరిచాడు. వీరిద్దరి నుంచి మరీ ఇలాంటి ఘోరమైన ప్రదర్శనను ఊహించలేదన్నాడు. మరీ హాంగ్‌ కాంగ్‌ వంటి జట్టుతో మ్యాచ్‌లో ఇలా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వారి కెరీర్‌లో పీడకలలా మిగిలిపోతాయని ఈ మాజీ ఆల్‌రౌండర్‌ అన్నాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో పోలిస్తే.. హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో మరీ దారుణంగా విఫలమయ్యారని ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లను విమర్శించాడు. ఆసియా కప్‌-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌(ఫఖర్‌ జమాన్‌) తీశాడు.

దంచి కొట్టిన హాంగ్‌ కాంగ్‌ బ్యాటర్లు!
ఇక అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, పాక్‌తో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా పసికూన హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో మాత్రం.. వీరిద్దరి బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు దంచికొట్టారు.

అర్ష్‌దీప్‌ 4 ఓవర్ల బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మరోవైపు.. ఆవేశ్‌ ఖాన్‌ తన బౌలింగ్‌ కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగాడు.


ఆవేశ్‌ ఖాన్‌

మరీ హాంగ్‌ కాంగ్‌ చేతిలోనా?!
ఈ నేపథ్యంలో ఇండియా న్యూ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రితీందర్‌ సోధి.. ఇలాంటి చెత్త ప్రదర్శన యువ బౌలర్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నాడు. ‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మన పేస్‌ బౌలింగ్‌ మెరుగ్గానే అనిపించింది. కానీ ఈ మ్యాచ్‌లో మరీ ఘోరం. 

ముఖ్యంగా అర్ష్‌దీప్‌ లయ తప్పినట్టు కనిపించింది. ఇక ఆవేశ్‌ అయితే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హాంగ్‌ కాంగ్‌ వంటి జట్టు చేతిలో ఇలాంటి ప్రదర్శన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిద్ర కూడా పట్టదు. ఇలాంటి వాటి వల్ల వారు ఆత్మవిశ్వాసం కోల్పోతారు’’ అని రితీందర్‌ సోధి పేర్కొన్నాడు.

ఇక మాజీ సెలక్టర్‌ సబా కరీం సైతం.. ఆవేశ్‌, అర్ష్‌దీప్‌ ఇద్దరూ మెరుగ్గా రాణించలేకపోతున్నారని.. కోచ్‌ పారస్‌ మంబ్రే వారి ఆటపై దృష్టి సారించాలని సూచించాడు. ముఖ్యంగా ఆవేశ్‌ ఖాన్‌ లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్దుకునేలా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నాడు.

చదవండి: Asia Cup 2022: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా!
Asia Cup 2022: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. తొలి భారత ఆటగాడిగా!

మరిన్ని వార్తలు