Asia Cup 2022: వాళ్ల బౌలింగ్‌ గొప్పగా ఏమీ లేదు.. కాబట్టి కోహ్లి ప్రదర్శన: గంభీర్‌

1 Sep, 2022 17:03 IST|Sakshi
గౌతమ్‌ గంభీర్‌- విరాట్‌ కోహ్లి

Asia Cup 2022- India Vs Hong Kong: ‘‘ఇలాంటి జట్టుతో మ్యాచ్‌లో కోహ్లి ఒక్కడనే కాదు.. ఏ ఇతర బ్యాటర్‌ ప్రదర్శనను కూడా జడ్జ్‌ చేయలేము. అయితే, ఏ ప్రత్యర్థి ఎవరైనా పరుగులు రాబట్టడమే ముఖ్యం కదా’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఇప్పుడే కోహ్లి ఆట తీరుపై అంచనాకు రాలేమని పేర్కొన్నాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చాలా రోజుల తర్వాత అర్ధ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే.

ఆసియా కప్‌-2022లో భాగంగా దుబాయ్‌ వేదికగా హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌, మూడు సిక్సర్ల సాయంతో 59 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో కోహ్లి ప్రదర్శన గురించి స్టార్‌ స్పోర్ట్స్‌ చర్చ సందర్భంగా గౌతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హాంగ్‌ కాంగ్‌ వంటి పసికూనపై ఈ స్కోరుతో కోహ్లి మునుపటి లయ అందుకున్నాడా లేదా అన్న విషయంపై అంచనాకు రాలేమన్నాడు. ఈ మ్యాచ్‌లో హంగ్‌ కాంగ్‌ బౌలింగ్‌ గొప్పగా ఏమీలేదని(నాసిరకంగా ఉందన్న ఉద్దేశంలో).. ఏదేమైనా కోహ్లి పరుగులు సాధించడం సానుకూల అంశం అని గౌతీ అన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి.. కానీ
అదే విధంగా టీమిండియా ఓపెనర్లు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో పోలిస్తే కోహ్లి బెటర్‌ అని గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ‘‘విరాట్‌ కోహ్లి మాదిరిగానే.. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌కు అవకాశాలు వస్తున్నాయి. అయితే, కోహ్లి వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు.

కానీ.. వీళ్లిద్దరి విషయంలో అలా జరగడం లేదు. కఠిన శ్రమ.. ప్రణాళిక ఉంటేనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలం’’ అంటూ కోహ్లిని ప్రశంసించాడు. కాగా రోహిత్‌, రాహుల్‌ పాకిస్తాన్‌, హాంగ్‌ కాంగ్‌ మ్యాచ్‌లలో సాధించిన పరుగులు వరుసగా.. 12, 0.. 21, 36. ఇదిలా ఉంటే.. హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ రాణించడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్‌-4కు అర్హత సాధించింది. 

చదవండి: Asia Cup 2022: హవ్వ.. మరీ హాంగ్‌ కాంగ్‌ చేతిలోనా? కంటి మీద కునుకు ఉంటుందా: భారత మాజీ క్రికెటర్‌
Ind Vs HK: 'నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్‌'

మరిన్ని వార్తలు