IND Vs PAK Super-4 Mohammad Rizwan: 'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్‌ ఆఫ్‌ త్రీ ఆడుతున్నట్లుంది'

4 Sep, 2022 12:22 IST|Sakshi

టీమిండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లుకు ఆస్కారం లేకపోవడంతో కేవలం మెగాటోర్నీల్లో మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. తాజాగా ఆసియా కప్‌లో వారం గ్యాప్‌ వ్యవధిలో రెండోసారి ఎదురుపడుతున్నాయి. మరి లీగ్‌ దశలో టీమిండియాతో చేతిలో ఓడిన పాకిస్తాన్‌ సూపర్‌-4 దశలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. 

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌ స్టార్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్‌ ముగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రిజ్వాన్‌ మాటల మధ్యలో జోకులు వేసి నవ్వించాడు. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌నుద్దేశించి.. '' వారం వ్యవధిలో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరగడం రెండోసారి. రెండుజట్లు ఎప్పుడు తలపడినా రసవత్తర పోరు ఖాయం. అయితే ముచ్చటగా మూడోసారి కూడా మ్యాచ్‌ జరగాలని.. అది వచ్చే ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ కావాలని ఇరుదేశాల అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఫలించాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇది చూసిన తర్వాత ఒక జోక్‌ చెప్పాలనిపిస్తుంది. నాకైతే ఆసియా కప్‌ ఆడుతున్నట్లు లేదు.. బెస్ట్‌ ఆఫ్‌ త్రీ మ్యాచ్‌ సిరీస్‌ ఆడుతున్నట్లుగా ఉంది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.

అయితే యాదృశ్చికమో లేక అలా జరగాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ.. రిజ్వాన్‌ చెప్పిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తు‍న్నాయి. పేరుకే ఆసియా కప్‌ టోర్నీగా పెట్టి.. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య దైపాక్షిక సిరీస్‌కు బదులు ఇలాంటివి ప్లాన్‌ చేస్తున్నారని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే.. కచ్చితంగా వచ్చే ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌-పాకిస్తాన్‌లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ పేర్కొన్నారు.

ఇక టీమిండియాతో మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన రిజ్వాన్‌.. హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో 78 పరుగులు నాటౌట్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి తోడుగా ఫఖర్‌ జమాన్‌ ఫిప్టీ చేయగా.. చివర్లో కుష్‌దిల్‌ షా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా 193 పరుగుల భారీ స్కోరు చేసిన పాక్‌.. అనంతరం హాంగ్‌ కాంగ్‌ను 38 పరుగులకే కుప్పకూల్చి 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సూపర్‌-4లో అడుగుపెట్టిన పాక్‌.. భారత్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో

Chamika Karunaratne: 'నాలుగేళ్ల పగను మనసులో దాచుకున్నా'.. అందుకే నాగిన్‌ డ్యాన్స్‌

మరిన్ని వార్తలు