Rashid Khan: ఆరోజు కోహ్లి రెండున్నర గంటల పాటు బ్యాటింగ్‌ చేశాడు.. నేను షాకయ్యా! నెక్ట్స్ డే 73 పరుగులు!

25 Aug, 2022 16:17 IST|Sakshi
దుబాయ్‌లో కోహ్లి- రషీద్‌ ముచ్చట(Photo Credit: BCCI)

Asia Cup 2022- Rashid Khan Comments On Virat Kohli: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిపై అఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ప్రశంసలు కురిపించాడు. ఆట కోసం ఎంతటి శ్రమకైనా ఓర్చేతత్వం అతడిదని.. పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడని కొనియాడాడు. కోహ్లి ఇప్పటికే కెరీర్‌లో అత్యుత్తమ దశకు చేరుకున్నాడన్న రషీద్‌.. అందుకే అతడిపై అంచనాలు భారీగా ఉంటాయని పేర్కొన్నాడు.

కాబట్టి ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాలని అభిమానులు భావిస్తున్నారని.. అందుకు కోహ్లి గొప్ప ఆటతీరే కారణమని చెప్పుకొచ్చాడు. చాలా రోజులుగా జట్టుకు దూరమైన కోహ్లి ఆసియా కప్‌-2022 టోర్నీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. యూఏఈ వేదికగా ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

నిజంగా చెప్తున్నా.. రెండున్నర గంటలు బ్యాటింగ్‌!
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ ప్రజెంటర్‌ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వూలో అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ​జరిగిన సంఘటన తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.

ఈ మేరకు రషీద్‌ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో భాగంగా ఆ మరుసటి రోజు మేము ఆర్సీబీతో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అప్పుడు నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లిని చూశాను. నిజం చెప్తున్నా.. అతడు రెండున్నర గంటల పాటు బ్యాటింగ్‌ చేస్తూనే ఉన్నాడు. అది చూసి నేను షాక్‌ అయిపోయాను.

అర్ధ శతకంతో మెరిశాడు..
తర్వాతి రోజు మాతో మ్యాచ్‌లో కోహ్లి 70కి పైగా పరుగులు సాధించాడు. తను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక అందరూ అంటున్నట్లుగా కోహ్లి ఫామ్‌ కోల్పోయినట్లు తాను భావించడం లేదని.. తనపై ఉన్న అంచనాల కారణంగానే విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. కోహ్లి స్థానంలో ఓ సాధారణ బ్యాటర్‌ ఉంటే ఇలాంటి మాటలు వినిపించేవి కావని పేర్కొన్నాడు.

వాళ్లిద్దరికీ బౌలింగ్‌ చేయడం ఇష్టం
ఇక విరాట్‌ కోహ్లి, బాబర్‌ ఆజం వంటి టాప్‌ క్లాస్‌ బ్యాటర్లుకు బౌలింగ్‌ చేయడం తనకు ఇష్టమని రషీద్‌ తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2022లో రషీద్‌ ఖాన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు అరంగేట్ర సీజన్‌లోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.

కాగా ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లి.. గుజరాత్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా బెంగళూరును 8 వికెట్ల తేడాతో గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌కు ముందు కోహ్లి ప్రాక్టీసు చేసిన విషయాన్ని రషీద్‌ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్‌! కానీ కోహ్లి మాత్రం..
Asia Cup 2022 Ind Vs Pak: బాబర్‌ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్‌! రషీద్‌తోనూ ముచ్చట!

>
మరిన్ని వార్తలు