Rohit Sharma: ఆసియా కప్‌లో రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర.. సచిన్‌ రికార్డు బద్దలు

6 Sep, 2022 21:08 IST|Sakshi

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి తన హిట్టింగ్‌ పవర్‌ చూపించాడు. ఆరంభంలోనే కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికి సూర్యకుమార్‌తో కలిసి రోహిత్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న రోహిత్‌.. ఓవరాల్‌గా 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ అరుదైన రికార్డులు అందుకున్నాడు. 

►ఆసియాకప్‌ టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున టోర్నీలో రోహిత్‌ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆసియాకప్‌లో టీమిండియా తరపున సచిన్‌ టెండూల్కర్‌(971 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. తాజాగా రోహిత్‌ సచిన్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

►టీమిండియా తరపున 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్న రోహిత్‌.. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సనత్‌ జయసూర్య 1220 పరుగులు.. కుమార సంగక్కర 1075 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 

►ఆసియాకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇంతకముందు షాహిద్‌ అఫ్రిదితో కలిసి 40 సిక్సర్లతో సంయుక్తంగా ఉన్న రోహిత్‌ తాజాగా తొలి స్థానంలో నిలిచాడు. 

మరిన్ని వార్తలు