Asian Airgun Championship 2022: భారత్‌ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు

17 Nov, 2022 05:35 IST|Sakshi
ఇషా సింగ్‌, రిథమ్‌ సాంగ్వాన్‌

డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్‌ మహిళల 10 ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్‌ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది.

సీనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో రిథమ్‌ సాంగ్వాన్‌ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో సాగర్, సామ్రాట్‌ రాణా, వరుణ్‌ తోమర్‌లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్‌ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్‌లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి.   

మరిన్ని వార్తలు