Telangana Boxer: హుసాముద్దీన్‌ శుభారంభం 

25 May, 2021 08:05 IST|Sakshi

దుబాయ్‌: ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో 56 కేజీల విభాగంలో హుసాముద్దీన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో హుసాముద్దీన్‌ 5–0తో రెండుసార్లు ఆసియా యూత్‌ చాంపియన్‌గా నిలిచిన మక్మూద్‌ సబీర్‌ఖాన్‌ (కజకిస్తాన్‌)పై విజయం సాధించాడు. 64 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన శివ థాపా గెలిచాడు. తొలి రౌండ్‌లో శివ థాపా 5–0తో దిమిత్రి పుచిన్‌ (కజకిస్తాన్‌)పై నెగ్గాడు.    

నిజామాబాద్‌ బిడ్డ.. బాక్సింగ్‌ బాదుషా!
బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసే హుసాముద్దీన్‌.. చిన్ననాటి నుంచి తండ్రి శంషామొద్దీన్‌ శిక్షణలో రాటుదేలాడు. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న అతడు.. 2010 నుంచి ఇప్పటివరకు ఏటా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఇందూరు కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. ఓ వైపు ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవలందిస్తున్న అతడు.. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుసాముద్దీన్‌.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. 

ఎన్నెన్నో పతకాలు.. 
2015లో కోరియాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, 2016 గౌహతిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించాడు. 2017లో బల్గేరియాలో జరిగిన పోటీల్లో రజత పతకం, మంగోళియాలో కాంస్య పతకం గెలుపొందాడు. 2018లో వరుసగా ఆస్ట్రేలియా, బల్గేరియా, ఢిల్లీలలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2019లో బెంగళూరు, ఖజకిస్తాన్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అతడు.. చైనాలో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

చదవండి: Asian Boxing Championship: రింగ్‌లోకి దిగకముందే 7 పతకాలు!
French Open: సుమిత్‌ తొలి రౌండ్‌ ప్రత్యర్థి మార్కోరా

>
మరిన్ని వార్తలు